పార్లమెంటు ఎన్నికల పై తెలంగాణ కాంగ్రెస్ పెద్దల నజర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఆ వైఫల్యం ఎదురుకాకుండా ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ వేస్తోంది. ముందస్తుగానే ఫిబ్రవరిలోనే పార్లమెంటు అభ్యర్ధులను ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉద్దండులు ఓటమి పాలయ్యారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని నేతలంగా ఉవ్విళ్లూరుతున్నారు.

లోక్ సభ సీట్ల పై ఇప్పటికే కన్నేసిన నేతలు ఢిల్లీ స్థాయిలో అప్పుడే లాబీయింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. తమకు అనుకూలమైన నేతలను కలిసి తమ కోర్కెను చెబుతున్నారని గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో లోక్ సభలో పని చేస్తామని చెబుతూ ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో తెలంగాణ కాంగ్రెస్ ఆశావాహులున్నారు. తెలంగాణలో ని 17 అసెంబ్లీ స్థానాలకు గాను 15 అసెంబ్లీ స్థానాల్లో గట్టి పోటి ఉంది. 2 స్థానాల్లో పోటి చేసేందుకు అసలు నేతలే ముందుకు రావడం లేదు. హైదరాబాద్,  పెద్దపల్లి స్థానాలకు అసలు కాంగ్రెస్ నాయకులు పోటిలోనే లేరని తెలుస్తోంది.  

నల్లగొండ ఎంపీ సీటు చాలా ఆసక్తికరంగా మారింది. నల్లగొండ ఎంపీగా పోటి చేస్తానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇదే స్థానం నుంచి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ భార్య పద్మావతి కూడా పోటి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే సీఎం కేసీఆర్ కూడా నల్లగొండ నుంచే పోటి చేస్తారని తెలుస్తుండడంతో నల్లగొండ సీటు ఎవరికి దక్కేనోనని చర్చ జరుగుతోంది.

మహబూబ్ నగర్ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటి చేస్తారని తెలుస్తోంది. అయితే అదే స్థానం నుంచి మాజీ మంత్రి డికె అరుణ, జైపాల్ రెడ్డి కూడా పోటిలో ఉండవచ్చని నేతలు అంటున్నారు. జైపాల్ రెడ్డి తప్పుకున్నా డికె అరుణ కూడా ఎంపీగా సిద్దమవుతారని తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎంపీ సీటు ఎవరిని వరిస్తుందోనని అంతా చర్చించుకుంటున్నారు.

నియోజకవర్గాల వారీగా ఎంపీ సీటుకు పోటి పడుతున్న కాంగ్రెస్ పెద్దలు వీరే

నల్లగొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, పద్మావతిఉత్తమ్ కుమార్ రెడ్డి

భువనగిరి- గూడూరు నారాయణ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వంగాల స్వామిగౌడ్

చేవేళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పటోళ్ల కార్తీక్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్

మహబూబ్ నగర్- డికె అరుణ, రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి

ఖమ్మం- రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఆదిలాబాద్- రమేష్ రాథోడ్, నరేష్ జాదవ్

మహబూబాబాద్‌ – బలరాంనాయక్, రవీంద్రనాయక్, బెల్లయ్యనాయక్

నాగర్‌కర్నూలు – నంది ఎల్లయ్య, మల్లు రవి, సంపత్

సికింద్రాబాద్‌- అంజన్‌కుమార్‌ యాదవ్, అజారుద్దీన్, బండ కార్తీకరెడ్డి

మెదక్‌- దామోదర రాజనర్సింహ, నిర్మలాజగ్గారెడ్డి

 మల్కాజ్‌గిరి – కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రేణుకాచౌదరి

 వరంగల్‌- మాజీ ఎంపీలు రాజయ్య, విజయరామారావు, ఇందిర

 నిజామాబాద్‌- ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్

కరీంనగర్‌ – జీవన్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

 జహీరాబాద్‌- సురేశ్‌షెట్కార్‌

హైదరాబాద్ స్థానం నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను బరిలో దింపాలని అధిష్టానం భావిస్తున్నా ఆయన మాత్రం సికింద్రాబాద్ స్థానం నుంచి పోటి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్, పెద్దపల్లిలో మాత్రం పోటికి ఎవరు కూడా సిద్దంగా లేరని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలల్లో ఎంత మంది సీనియర్లకు అదృష్టం వరిస్తుందో చూడాలి.