కాంగ్రెస్ నేత, ఉమ్మడి రాష్ట్ర కాలంలో విప్ గా పని చేసిన ఈరవత్రి అనీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల యవారం చూస్తుంటే ఈ అరెస్టు ఉత్తుత్తి అరెస్టు కాదని పకడ్బంధీగానే చేసినట్లు తెలుస్తోంది. అనీల్ ను జైలుకు పంపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అనీల్ ను ఆదివారం సాయంత్రం ఆర్మూర్ ఎసిపి స్వయంగా బాల్కొండలోని అనీల్ ఇంటికి వచ్చి అనీల్ ను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపట్లో ఆయనను ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలున్నాయి. రాత్రి వరకు జైలుకు తరలించొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
గత 15రోజులుగా లీకేజీ వాటర్ విడుదల కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్న బాధతో రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజుల క్రితం జాతీయ రహదారి 44 ని రైతులు దిగ్భందించారు. ఈ కార్యక్రమంలో మాజీ విప్ అనీల్ పాల్గొన్నారు. అయితే హైవే దిగ్బంధంలో ఆందోళన శృతి మించింది. ఈ సందర్భంగా రైతులు ఆగ్రహంతో పలు బస్సు అద్దాలను పగలగొట్టారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద రైతులతోపాటు మాజీ ఎమ్మెల్యే అనీల్ మీద కూడా కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే ఎ 1గా ఉన్న ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేసి ఉన్నారు. ఈ కేసులో ఎ 1 గా మాజీ ఎమ్మెల్యే అనీల్ ను పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇవాళ సాయంత్రం అనీల్ ను ఇంటికొచ్చి పోలీసులు అరెస్టు చేశారు. అనీల్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటికి వచ్చారని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేసి నిజామాబాద్ కు తరలించారు. అనీల్ తోపాటు, ఆయన అనుచరుల అరెస్టు తాలూకు వీడియోలు పైన ఉన్నాయి చూడండి.