గందరగోళంగా తెలంగాణ గ్రూపు 4 పరీక్ష

తెలంగాణలో టిఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూపు 4 పరీక్ష గందరగోళానికి దారితీస్తున్నది. ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలే మళ్లీ రిపీట్ కావడంతో చాలా మంది విద్యార్దులు అవాక్యయ్యారు. ఏ కోడ్ సిరిస్ పేపర్ లో దాదాపు 30 నుంచి 40 ప్రశ్నలు వచ్చిన ప్రశ్నలే మళ్లీ వచ్చాయి.

హైదరాబాద్ లోని దమ్మాయిగూడలోని సాయి సిద్దార్ధ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ఏ కోడ్ ప్రశ్నాపత్రంలో బీ కోడ్ ప్రశ్నలు కొందరు అభ్యర్ధులకు వచ్చాయి. మరి కొందరికి ఏ కోడ్ లో వచ్చిన ప్రశ్నలు, బి కోడ్ ప్రశ్నలు దాదాపు సమానంగా ఇచ్చారు. ఈ విషయాన్ని అభ్యర్దులు ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లగా టిఎస్ పీఎస్సీ చూసుకుంటుందని వారు వివరణ ఇచ్చారు. పలు సెంటర్లలో పేపర్లను ఆలస్యంగా ఇచ్చి ఎక్స్ ట్రా సమయం అడిగితే వారు ఇవ్వలేదు. దీంతో అభ్యర్దులు పరీక్షా కేంద్రంలోనే నిరసన చేపట్టడంతో అప్పుడు అదనపు సమయం ఇచ్చారని అభ్యర్దులు చెప్పారు. 

విషయం తెలుసుకున్న టిఎస్ పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ స్పందించారు. విషయాన్ని గుర్తించిన వెంటనే చీఫ్ సూపరిండెంట్ వేరే ప్రశ్నాపత్రం ఇచ్చి సమస్యను పరిష్కరించారన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు లేవని పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు తెలిపారు. కొద్ది రోజుల్లోనే అభ్యర్దుల ఆన్సర్ షీటు ఓ ఎం ఆర్ కాపీ అందుబాటులో ఉంటుందని, కీ కూడా అప్పుడే విడుదల చేస్తామన్నారు. 

గ్రూపు 4 పరీక్ష ప్రశ్నాపత్రాల సరళి పై అభ్యర్దులు పలు రకాలుగా చర్చించుకున్నారు. జనరల్ స్టడీస్ పేపర్ కాస్త ఈజీగానే వచ్చినా సెకండ్ పేపర్ లో చాలా టఫ్ గా ప్రశ్నలు అడిగారని అభ్యర్దులు ఆవేదన చెందారు. 

గ్రూప్‌-4 సర్వీసులు, జీహెచ్‌ఎంసీలో బిల్‌ కలెక్టర్లు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో పలు పోస్టులు, టీఎస్‌ఆర్టీసీలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈపరీక్షకు 65శాతం మంది అభ్యర్థులు హాజర య్యారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,867 గ్రూప్‌-4 పోస్టులకు 4,80,481 మంది అభ్యర్థులకుగాను ఉదయం పేపర్‌-1కు 3,12,397 మంది, మధ్యాహ్నం పేపర్‌-2కు 3,09,482 (65 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. నల్లగొండ జిల్లాలో 15,641 మంది దరఖాస్తు చేయగా, ఉదయం పేపర్‌-1కు 11,800 మంది, మధ్యాహ్నం పేపర్‌-2కు 11,714 (75 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. అత్యల్పంగా కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 7,317 మంది దరఖాస్తు చేస్తే, ఉదయం పేపర్‌-1కు 886 మంది, మధ్యాహ్నం పేపర్‌-2కు 881 (12 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు.

కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా పరీక్షను పర్యవేక్షించామని తెలిపారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించడం కోసం రాష్ట్రంలో 1,046 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.