ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతులకు బెనిఫిట్ కలిగేలా రైతు భరోసా స్కీమ్ ను అమలు చేస్తున్న జగన్ రైతులకు సకాలంలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో జగన్ రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను స్థాపించారనే సంగతి తెలిసిందే. ప్రభుత్వం రైతుల నుంచి భూములను తీసుకుని సౌర, పవన్ సంస్థలకు ఇస్తుందని జగన్ చెబుతున్నారు.
ఎకరానికి 30,000 రూపాయల చొప్పున లీజు చెల్లించడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటామని చెప్పడం గమనార్హం. మూడు సంవత్సరాలకు ఒకసారి లీజును 5 శాతం పెంచుతామని జగన్ అన్నారు. అయితే జగన్ ప్రతిపాదనకు రైతులు అంగీకరించే అవకాశాలు తక్కువని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. కనీసం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగే విధంగా భూములను సేకరించాలని జగన్ సర్కార్ సూచనలు చేసింది.
ప్రస్తుతం రైతులకు ఎకరానికి 30,000 రూపాయలు అంటే ఎక్కువ మొత్తమే అయినా రాబోయే రోజుల్లో పెంచే మొత్తం తక్కువ కావడంతో రైతులు భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. పంటలు పండి లాభాలను గడిస్తున్న రైతులు, వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్న కుటుంబాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశం అయితే ఉండదని చెప్పాలి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారితే రైతులకు మళ్లీ ఇబ్బందులు ఎదురైతే ఎలా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రశ్నలకు జగన్ సర్కార్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాల్సి ఉంది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు భూములు ఇవ్వాలని కోరితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. వాణిజ్య పంటలు రైతులకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తున్న నేపథ్యంలో రైతులు ఏం చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.