Cinema Tickets : ఎక్కడో తేడా కొడుతోంది. సినిమా టిక్కెట్ల విషయమై ఇంత రాద్ధాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుండడంపై అటు సామాన్యుల్లోనూ, ఇటు రాజకీయ విశ్లేషకుల్లోనూ, ఇంకోపక్క సినీ పరిశ్రమలోనూ గత కొద్ది కాలంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరల్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెట్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాల్ని నిరోధించేందుకోసం ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సినిమా ప్రేక్షకుడు చెల్లించే మొత్తంలో కొంత భాగం పక్కదారి పడుతోందన్నది రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే, అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంది.
అయితే, ఇక్కడ అసలు సమస్య ఇంకోటుంది. అదే, టిక్కెట్ల ధరల నియంత్రణ పేరుతో.. మరీ దారుణంగా టిక్కెట్ ధరల్ని తగ్గించడం. అలాగే, బెనిఫిట్ షోలకు అవకాశమివ్వకపోవడం. దాంతోపాటుగా, పెద్ద సినిమాలకు అదనపు షోలు, కొన్ని రోజులపాటు టిక్కెట్ ధరల్ని పెంచుకునే వెసులుబాటు కల్పించకపోవడం.. ఇవన్నీ ముఖ్యమైన సమస్యలుగా మారిపోయాయి.
మండుతున్న పెట్రో ధరలపై నిరసనల్లేవు, అభ్యంతరాల్లేవు.. ఇంత రాద్ధాంతమూ జరగడంలేదు. నిత్యావసర వస్తువుల ధరల సంగతి సరే సరి. ఇవి కాక, ప్రభుత్వాలు ఆయా వస్తువులపైనా, ఇతరత్రా వ్యవహారాలపైనా పెంచుతున్న పన్నుల విషయంలోనూ రాద్ధాంతం ఈ స్థాయిలో జరగడంలేదు.
ప్రభుత్వం కూడా, ఆయా ధరల్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టకుండా, కేవలం సినిమా టిక్కెట్ ధరల మీదనే స్పెషల్ ఫోకస్ పెట్టడం పట్ల భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి గోల వారిది. ఎవరో తెరవెనుకాల కథ నడిపిస్తున్నారనీ, సినిమా పరిశ్రమను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారని.. ఓ బలమైన వాదన అయితే ప్రముఖంగా వినిపిస్తోంది. నిజమేనా అది.? ఆ బలమైన శక్తి ఏది.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి ఇలాంటి ప్రశ్నలకి.