ఏపీలో ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క కేసు 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ భవిష్యత్తునీ, అంతకంటే ఎక్కువ అనుభవం ఉందని చెబుతున్న రాజకీయ నాయకుడి ఫ్యూచర్ ని ప్రశ్నార్ధకం చేసేసింది! ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు మాసం రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే… బయట కేడర్ అయోమయంతో ఉన్నారని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే… మరోపక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం కేసు తాలూకు కాకకూడా మొదలైపోయినట్లుంది. ఇందులో భాగంగా ఈ రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా లోకేష్ పై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారని అంటున్నారు. ఇందులో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు.. మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా.. హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు.. ఎవరు మార్చమన్నారు.. వంటి మొదలైన ప్రశ్నల వర్షం లోకేష్ పై కురిసిందని తెలుస్తుంది.
ఇదే క్రమంలో… మరికొన్ని ప్రశ్నలు లోకేష్ ని అడిగారని చెబుతూ కొన్ని ప్రశ్నలు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా… హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది? 2014 జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా? లింగమనేని రమేష్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి? మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేశారు?
ఇక ఏ1 ముద్దాయి చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందా? అని ప్రశ్నించారని అంటున్నారు. ఇదే సమయంలో… పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ ల ఆధారంగా నారా లోకేష్ ను సీఐడీ అధికారులు ప్రశ్నించారని చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో… లోకేష్ స్వయంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు సీఐడీ చూపించిందని అంటున్నారు.
ఇలా వితౌట్ గ్యాప్ ప్రశ్నల వర్షం కురిపించే సరైకి… చినబాబు పలుమార్లు నీళ్లు నమిలారంటూ వస్తున్న ఊహాగాణాల సంగతి కాసేపు పక్కనపెడితే… చాలా సార్లు తన న్యాయవాదులతో చర్చించిన అనంతరం సమాధానం చెప్పారని అంటున్నారు. ఇదే సమయంలో అధిక శాతం ప్రశ్నలకు “అదుర్స్” సినిమాలోని డైలాగును నమ్ముకున్నారని అంటున్నారు.
అయితే ఈ విచారణతో ఏపీ సీఐడీ హ్యాపీనా… లేక, సహకరించలేదనే కారణంతో కస్టడీ ఏమైనా కావాలని అడుగుతారా అనేది వేచి చూడాలి!