అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం కేసులో లోకేష్ ను ఏ-14గా పేర్కొంటు సీఐడీ మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో లోకేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కు ప్రయత్నించారు. అయితే అందుకు అంగీకరించని న్యాయస్థానం, ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోస్ చేసింది. ఇదే సమయంలో లోకేష్ కు 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని సీఐడీని ఆదేశించింది.
దీంతో చాలా నాటకీయ పరిణామాల అనంతరం శనివారం ఢిల్లీలో సీఐడీ అధికారులు లోకేష్ కు 41-ఏ నోటీసులు ఇచ్చారు. ఆ విషయాన్ని లోకేష్ ధృవీకరించారు. ఇందులో భాగంగా… ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన మెంట్ కేసులో అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించారు.
ఇదే సమయంలో నోటీసులు అందుకున్నాక విచారణకు రాకపోయినా, నిబంధనలను పాటించకపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ(3), (4) ప్రకారం అరెస్ట్ తప్పదని స్మూత్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. హెరిటెజ్ ఫుడ్స్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను విచారణ అధికారులకు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా… భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలని అన్నారు.
అదేవిధంగా… అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి లావాదేవీల వివరాలు అన్నీ విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురావాలని సీఐడీ అధికారులు లోకేష్ కి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లోకేష్ స్పందించారు. “మాకు వాయిదాలు అడిగే అలవాటు లేదు” అని చెప్పుకొచ్చారు.
అనంతరం… తప్పు జరుగలేదు.. కుంభకోణం జరుగలేదు.. ఏనాడూ తప్పు చేయలేదు మేము.. వాళ్ళ లాగా క్విడ్ ప్రోకో చెయ్యలేదు.. అని లోకేష్ స్పందించారు. ఇదే సమయంలో ఏపీ డీజీపీపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇదే సమయలో ఈ కేసుల్లో ఎక్కడా ఎలాంటి ఆధారాలూ లేవని తెలిపారు.
ఈ సందర్భంగా సీఐడీ వైసీపీ అనుబంధ విభాగం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్… సీఐడీ అధికారులు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారని వ్యంగ్యంగా మట్లాడారు! దీంతో నెటిజన్లు కీబోర్డులకు పనిచెబుతున్నారు. సీఐడీ ఇచ్చిన ప్రేమలేఖ కు సంబంధించిన డేటింగ్ ఈ నెల 4 న ఉదయం 10 గంటలకే మొదలైపోతుందని… అక్కడ వార్ వన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉందని… సహకరించకపోతే శ్రీకృష్ణ జన్మస్థానమే అని కామెంట్స్ చేస్తున్నారు.