మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం పనిచేయడం దాదాపుగా ఖాయమైపోయింది. ప్రత్యక్షంగా జనసేన పార్టీ తరఫున పనిచేస్తారా.? లేదంటే, తెరవెనుకాల తమ్ముడికి సహాయ సహకారాలు అందిస్తారా.? అన్నదానిపై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది. గత కొద్ది రోజులుగా చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య తరచూ భేటీలు జరుగుతున్నాయి. చిరంజీవిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వీలు చిక్కినప్పడల్లా కలుస్తున్నారట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం చిరంజీవితో మంతనాలు జరుపుతున్నారనేది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
త్వరలో చిరంజీవి, ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నారంటూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, అది వ్యక్తిగత టూర్ అనీ, అదే టూర్ సందర్భంగా చిరంజీవి ఢిల్లీలో బీజేపీ పెద్దలు కొందర్ని కలిసే అవకాశం వుందనీ అంటున్నారు. ఢిల్లీ టూర్ సంగతి పక్కన పెడితే, చిరంజీవి – పవన్ కళ్యాణ్ ఇటీవల తరచూ భేటీ అవడం, వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలకు సంబంధించేనని సమాచారం. ఈ క్రమంలోనే ఒకప్పుడు చిరంజీవితో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన కొందరు నాయకులు జనసేన వైపు మళ్ళే అవకాశం వుందని అంటున్నారు.
వైసీపీ నుంచి ఓ అరడజను మంది వరకు కీలక నేతలనదగ్గ వారు వయా చిరంజీవి, జనసేనతో టచ్‌లోకి వెళ్ళాలనుకుంటున్నారట. అయితే, ఈ విషయమై పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. సంక్రాంతి తర్వాత, జనసేన పార్టీ చుట్టూ అనేక సంచలనాలు చోటుచేసుకోనున్నాకనీ, చిరంజీవి ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటారని తెలుస్తోంది.