ఆయన మెగాస్టార్ చిరంజీవి.! ఓ పురస్కారం కోసం ఓ రాజకీయ పార్టీకి మద్దతిచ్చే పరిస్థితి వుండదు. కానీ, రాజకీయ ప్రయత్నాలైతే ఆ కోణంలో జరుగుతూనే వుంటాయ్. అదే రాజకీయం అంటే. పవన్ కళ్యాణ్‌ని విమర్శించేందుకు చిరంజీవి పేరుని వైసీపీ ఎలా వాడుకుంటోందో చూస్తూనే వున్నాం.
అదే పవన్ కళ్యాణ్‌ని మరింతగా ప్రసన్నం చేసుకునేందుకు చిరంజీవికి తాయిలాల్ని బీజేపీ ప్రకటిస్తే అందులో వింతేముంది.? మెగాస్టార్ చిరంజీవి చుట్టూ రాజకీయం నడుస్తోంది. చిరంజీవిని సినీ పరిశ్రమ పెద్దగా బీజేపీ గుర్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనలో చిరంజీవికి ప్రత్యేకమైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే.
తాజాగా, ఇండియన్ పిలిం పర్సనాలిటీ 2022 పురస్కారాన్ని చిరంజీవికి ప్రకటించడం చూశాం. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు చిరంజీవి గురించి బహు గొప్పగా సోషల్ మీడియాలో స్పందించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.
చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజకీయాల్లో చాలామందితో పరిచయాలున్నాయి. రాజకీయ నాయకుడు, సినీ ప్రముఖుడే కాదు.. పలు సేవా కార్యక్రమాలతోనూ చిరంజీవి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద గతంలో రాజకీయ ఆరోపణలు కొందరు చేసినా, వాటి వెనుక కుట్ర అందరికీ తెలిసిందే. ఈ రాజకీయాల్లో తాను మనుగడ సాధించలేనన్న అభిప్రాయానికి వచ్చిన చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వున్నారు.
చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఏపీలో పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని బీజేపీ భావిస్తోన్నమాట వాస్తవం. కానీ, అందుకు చిరంజీవి ఒప్పుకోవడంలేదు. పోనీ, బీజేపీకీ అలాగే జనసేనకు మద్దతిస్తే తెలుగు రాష్ట్రాల్లో బలపడతామని బీజేపీ అనుకుంటోంది. కానీ, బీజేపీ ఇలా ప్రకటించే తాయిలాలకు చిరంజీవి దిగివచ్చే పరిస్థితి వుండదుగాక వుండదు.