Chiranjeevi : మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి పేరు ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినిమా టిక్కెట్ల ధరల విషయమై చర్చించేందుకోసం తెలుగు సినీ పరిశ్రమ తరఫున ఓ బృందం త్వరలో అమరావతికి వెళ్ళనుంది. ఈ బృందానికి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వం వహించనున్నారన్నది ప్రస్తుతం తెలుగు సినీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.
ఇంతలోనే, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ, ఒకింత సంచలన వ్యాఖ్యలే చేశారు. ‘సినీ పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదు. సమస్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయ్.. అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం.. చిరంజీవి గతంలో వైఎస్ జగన్‌ని కలవడం కేవలం వ్యక్గిగతం..’ అనేశారు.
చిరంజీవి, టాలీవుడ్ బృందానికి నాయకత్వం వహించనున్నారన్న వార్త బయటకు పొక్కగానే, విష్ణు ఇలా మాట్లాడారా.? లేదంటే, అనుకోకుండా జరిగిన వ్యవహారమా ఇదంతా.? అన్నదానిపై మళ్ళీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సమస్య పరిష్కారం కోసం అడుగు ముందుకు పడుతుందనేలోపు, కొందరు వ్యూహాత్మకంగా మోకాలడ్డుతున్నారు. అసలు చిరంజీవి పేరు ఎలా గుసగుసల్లోకి వచ్చింది.? ‘పరిశ్రమకి పెద్దన్నగా నేనుండలేను..’ అని చిరంజీవి చెప్పాక కూడా, ఆయన నేతృత్వంలో బృందం వెళ్ళబోతోందని ఎలా ప్రచారం చేసినట్లు.?
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీ అయ్యారంటే సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్లే..’ అని నాగార్జున అంతటి వ్యక్తి అన్నాక, ‘వైఎస్ జగన్, చిరంజీవి భేటీ.. వ్యక్తిగతం..’ అని మంచు విష్ణు ఎలా అనగలిగినట్లు.?