రాజకీయాల్లో రీ-ఎంట్రీ విషయమై చిరంజీవికి ఎందుకింత అయోమయం.?

మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు సన్నద్శమవుతున్నారు. స్వతహాగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే, ఒకింత తటపటాయిస్తుంటారు చిరంజీవి. ఆ కారణంగానే, రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చే విషయమై చిరంజీవి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా చిరంజీవి చాలా అయోమయానికి గురయ్యారు. అదే ప్రజారాజ్యం పార్టీ కొంప ముంచేసింది. పరకాల ప్రభాకర్, లాంటి మేధావులు, తమ్మినేనీ సీతారాం లాంటి రాజకీయ నాయకులు.. చిరంజీవిని తేలిగ్గానే పక్కదారి పట్టించేశారు. వెరసి, చిరంజీవి తక్కువ కాలంలోనే ప్రజారాజ్యం పార్టీని మూసెయ్యాల్సి వచ్చింది.. కాదు కాదు, కాంగ్రెస్ పార్టీలో కలిపెయ్యాల్సి వచ్చింది.

అది గతం.! ఇప్పుడైతే జనసేన పార్టీ రూపంలో చిరంజీవికి ఓ రెడీమేడ్ పార్టీ సిద్ధంగా వుంది. దాదాపు ఎనిమిదేళ్ళుగా ఎదుగూబొదుగూ లేకుండా పోయింది జనసేన పార్టీ. ఆ పార్టీకి చిరంజీవి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతారు. అదే సమయంలో, చిరంజీవికి కూడా రాజకీయంగా జనసేన పార్టీ చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది.

‘నా తమ్ముడికి భవిష్యత్తులో నా నుంచి రాజకీయ మద్దతు వుంటుందేమో..’ అని ఇటీవల చిరంజీవి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు, ‘ఏదో ఒక రోజు నా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడు..’ అని కూడా చిరంజీవి వ్యాఖ్యానించారు.

తన తమ్ముడు నిబద్ధత, నిజాయితీ వున్నోడనీ చిరంజీవి చెప్పుకొచ్చారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ముఖ్యమంత్రి తనయుడి పాత్రను చిరంజీవి వ్యూహాత్మకంగా తొలగించిన సంగతి తెలిసిందే. ‘లూసిఫర్’ సినిమాని యధాతథంగా దించి వుంటే, ఆ పాత్ర పవన్ కళ్యాణ్‌ని గుర్తుకు తెచ్చేది. తద్వారా రాజకీయ రచ్చ జరిగేది కూడా.

ఏదిఏమైనా, 2024 ఎన్నికల్లోనే చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి నేరుగా మద్దతు పలికే అవకాశం వుంది. ఏమో, ఈక్వేషన్స్ అనుకూలంగా వుంటే, జనసేన తరఫున చిరంజీవి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.!