పవన్ కళ్యాణ్ ‘గాడ్ ఫాదర్’ చిరంజీవే.! ఇది క్లియర్.!

2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా చిరంజీవి ఏం చేయబోతున్నారు.? ఈ విషయమై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది. తెరవెనుకాల చిరంజీవి, జనసేన పార్టీకి మద్దతిచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యిందనే విషయాన్ని దాదాపుగా కన్ఫామ్ చేసేసుకోవచ్చు.

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాని తెలుగులో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’గా చేసిన విషయం విదితమే. ‘లూసిఫర్’ కథ గురించి అందరికీ తెలిసే వుంటుంది, ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. పొలిటికల్ గాడ్ ఫాదర్‌గా వ్యవహరిస్తాడు సినిమాలో హీరో.! ఓ రాజకీయ పార్టీకి అండగా, ఆ రాజకీయ పార్టీ అధినేతకు వెన్నుదన్నుగా.. ఇదీ ‘లూసిఫర్’ సినిమాలో హీరో పాత్ర.

ఆ పార్టీ సంక్షోభంలో వున్నప్పుడు, ‘లూసిఫర్’ చక్రం తిప్పుతాడు.. తన తమ్ముడ్ని అధికార పీఠమెక్కిస్తాడు. ‘గాడ్ ఫాదర్’ సినిమాకి కొన్ని మార్పులు చేశారు తెలుగు నేటివిటీ కోసం. మరి, ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగానే ఆ మార్పులు వుంటాయా.? ఖచ్చితంగా వుండి వుండొచ్చు.

‘నా తమ్ముడి నిబద్ధత నాకు తెలుసు..’ అంటూ చిరంజీవి తనదైన స్టయిల్లో రాజకీయంగా వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ పరిపాలించాలనే ఆశాభావాన్నీ చిరంజీవి వ్యక్తం చేశారు. అంతే కాదు, ‘పవన్ కళ్యాణ్ నా తమ్ముడే కాదు, నా బిడ్డ లాంటోడు కూడా..’ అని చిరంజీవి చెప్పినప్పుడు, ఆయన మాటల్లోని గాంభీర్యం.. వెరీ వెరీ స్పెషల్‌గా కనిపించింది.

ఇదంతా చూస్తోంటే, 2024 ఎన్నికలకు చిరంజీవి కూడా తెరవెనుకాల సర్వసన్నద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. ‘నేను రాజకీయాల్లో వుండకపోవడమే నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి ప్లస్ అనుకుంటున్నా.. అవసరమైతే, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా మద్దతిస్తానేమో..’ అని కూడా హింట్ ఇచ్చేశారు చిరంజీవి.