పొలిటికల్ రీ-ఎంట్రీ.! మెగాస్టార్ కావాలనే ఇలా చేశారా.?

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారన్న ఊహాగానాలు ఈనాడు కొత్తగా వినిపిస్తున్నవి కావు. చాలాకాలంగా ప్రచారంలో వున్నవే. చిరంజీవి మాత్రం, ‘అబ్బే, నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అనేది జరగదు..’ అని చెబుతూ వస్తున్నారు.

కానీ, చిరంజీవి త్వరలో.. అతి త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారన్న ప్రచారమైతే ఆగడంలేదు. బీజేపీ ఆయనకు రాజ్యసభ సీటుని ఆఫర్ చేసిందనీ, కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తామంటోందనీ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకోపక్క, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ‘గాడ్ ఫాదర్’లా చిరంజీవి వుండబోతున్నారన్న ప్రచారమూ జోరుగానే సాగుతోంది. సరిగ్గా ఈ తరుణంలోనే ‘గాడ్ ఫాదర్’ సినిమాకి సంబంధించిన ఓ చిన్న ఆడియో విడుదల చేశారు చిరంజీవి, సోషల్ మీడియా వేదికగా.

అయితే, గాడ్ ఫాదర్ ప్రస్తావన లేకుండా వచ్చిన ఆ వీడియోలో, ‘రాజకీయాల్ని నేను వదిలేసినా.. నన్ను రాజకీయాలు వదలడంలేదు..’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇది ‘గాడ్ ఫాదర్’ సినిమా డైలాగ్ అని, ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్ ‘లూసిఫర్’ చూసినవారెవరికైనా అర్థమవుతుంది.

ఒరిజినల్ వెర్షన్‌లో ఆ డైలాగ్ వుందని కాదుగానీ, ఆ సినిమా సబ్జెక్ట్ అలాంటిది. సో, చిరంజీవి విడుదల చేసింది జస్ట్ ‘గాడ్ ఫాదర్’ సినిమా తాలూకు డైలాగ్ మాత్రమే. కానీ, అంతకు మించి రాజకీయాల్లో చిన్నపాటి కుదుపు అయితే కనిపించింది తెలుగు రాష్ట్రాల్లో.. అందునా, తెలుగు మీడియాలో.

ఇంతకీ, చిరంజీవి కావాలనే ఇదంతా చేశారా.? ఓ సారి రాజకీయాల్లోకి వెళ్ళాక, ఆ రాజకీయం ఊరకే వుండనివ్వదు ఎవర్నయినా. వదిలేశామనుకుంటారుగానీ, ఆ రాజకీయం మాత్రం వదలదు. చిరంజీవికీ ఇది అనుభవమే.!