చంద్రబాబునాయుడుతో కటీఫ్ అయిన దగ్గర నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరచూ కొన్ని మాటలు చెబుతున్నారు. జగన్ బారి నుండి చంద్రబాబును తానే కాపాడానని, టిడిపికి తాను మద్దతు ఇవ్వబట్టే కాపుల ఓట్లు పడ్డాయని, చంద్రబాబు మాటలు నమ్మి తాను 2014 ఎన్నికల సమయంలో మోస పోయానని చెబుతున్న విషయాలు అందరికి తెలిసిందే. సరే పవన్ మాటల్లో ఎంత వరకూ నిజమో ఇప్పటికిప్పుడు ఎవరూ తేల్చలేరు కాబట్టి జనసేనాని ఎన్ని మాటలైనా చెప్పగలుగుతున్నారు.
కానీ అదే మాటలపై టిడిపి దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ మాత్రం ఫుల్లుగా ఫైరైపోయారు. తన వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిందని, కాపుల ఓట్లు తెలుగుదేశంపార్టీకి పడ్డాయనే మాటలను కొట్టి పారేస్తున్నారు. అదే సమయంలో పవన్ పై కొన్ని సూటి ప్రశ్నలు కూడా సంధించారు. ఇంతకీ అవేమిటంటే, నిజంగానే తెలుగుదేశంపార్టీకి కాపుల ఓట్లు పవన్ వల్లే పడుంటే మరి 2009లో సొంత అన్న చిరంజీవిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు ? టిడిపి తరపున పోటీ చేసిన కాపుల్లో ఎంతమంది గెలిచారు ? నిజమే మరి.
అప్పటి ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. రెండు కూడా కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే. పైగా పాలకొల్లు అత్తగారి నియోజకవర్గం కూడా. అయితే, తిరుపతిలో చావు తప్పి కన్నులొట్ట పోయినట్లుగా అత్తెసరు మెజారిటీతో బయటపడి పాలకొల్లులో ఓడిపోయారు. ఆ విషయాన్నే పవన్ ను ఉద్దేశించి చింతమనేని సూటిగా ప్రశ్నించారు. మరి ఆ ప్రశ్నకు పవన్ సమాధానం చెబుతారా ?
అలాగే, 2014 ఎన్నికలకు ముందు జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పవన్ మద్దతిస్తేనే టిడిపి గెలిచిందా అంటూ నిలదీశారు. ఈ ప్రశ్నలో కూడా వాస్తవముంది. 2014 ఎన్నికలకు ముందు జరిగిన జడ్పిటిసి, మున్సిపాలిటీ, సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్ధానాలను టిడిపి గెలుచుకుంది. మరి ఆ ఎన్నికల్లో టిడిపికి పవన్ మద్దతుగా ప్రచారం చేయకపోయినా టిడిపి మెజారిటీ స్ధానాలు ఎలా గెలుచుకున్నది ? అన్నది చింతమనేని ప్రశ్న. పనిలో పనిగా పోయిన ఎన్నికల్లో పవన్ ఎన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు ? పవన్ ప్రచారం చేసిన స్ధానాల్లో ఎన్నింటిని టిడిపి గెలుచుకుంది ? అని కూడా చింతమనేని అడుగుతున్నారు.
పవన్ చెప్పుకుంటున్న దాంట్లో ఎంత నిజముందో తెలీదు కానీ చింతమనేని అడిగిన ప్రశ్నల్లో మాత్రం లాజిక్ ఉంది. అందుకే పవన్ ను చింతమనేని ఓపెన్ చాలెంజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో తనపై పవన్ పోటీ చేసి గెలవాలంటూ చాలెంజ్ చేశారు. ఎవరినో పోటీకి దింపటం కాదన్నారు. తన దృష్టిలో మహిళా కార్యకర్తకు పవన్ కు పెద్ద తేడాలేదనే డ్యామేజింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. మరి, చింతమనేని ప్రశ్నలకు పవన్ సమాధానం చెబుతారా ? దెందులూరులో పవన్ పోటీ చేస్తారా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే వేచి చూడాల్సిందే.