బ్రేకింగ్ న్యూస్ : ఇంటెలిజెన్స్ చీఫ్ పై వేటు..ఈసి సంచలనం

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును హఠాత్తుగా మార్చేసింది.  వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు ఎస్పీలను కూడా ఎన్నికల విధుల నుండి పక్కనపెడుతూ కేంద్ర ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయం చంద్రబాబునాయుడుకు పెద్ద షాకనే చెప్పాలి.

కొంతకాలంగా వెంకటేశ్వరరావు వ్యవహారశైలి పై వైసిపి నేతలు పెద్ద ఎత్తన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. డిజిపి ఆర్పి ఠాకూర్, వెంకటేశ్వరరావుతో పాటు మరి కొందరు పోలీసు ఉన్నతాధికారులు దాదాపు చంద్రబాబు సొంత మనుషులుగా చెలామణి అవుతున్నట్లుగా పలు ఆరోపణలున్నాయి. చంద్రబాబు కోసమని వెంకటేశ్వరరావుతో పాటు కొందరు ఐపిఎస్ అధికారులు తమ నేతలను వేధిస్తున్నట్లుగా వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి తదితరులు ఈసికి ఫిర్యాదులు చేశారు.

తమకు అందిన ఫిర్యాదులపై ఈసి విచారణ జరిపించి వాస్తవాలను పోల్చుకుని వెంటనే చర్యలకు దిగింది. వెంకటేశ్వరరావుతో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహూల్ దేవ్ శర్మ, వెంకటరత్నంలను ఎన్నికల విధుల నుండి దూరంగా ఉంచాలని నిర్ణయించింది. వెంటనే ఆ మేరకు ఆదేశాలను కూడా జారీ చేసింది. ముగ్గురిని హెడ్ క్వార్టర్స్ కు వెంటనే సరెండర్ చేయాలన్న ఈసి ఆదేశాలు చంద్రబాబుకు మింగుడుపడనిదే.

వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ప్రధాన ప్రతిపక్ష ఎంఎల్ఏలను, నేతలను వేధిస్తున్నట్లుగా వైసిపి నేతలు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. అందులో భాగంగానే ఈసికి కూడా ఫిర్యాదు చేశారు. దాని ఫలితంగానే సంచలన నిర్ణయం. ముందు ముందు ఇంకెన్ని సంచలన నిర్ణయాలు బయటకు వస్తాయో చూడాల్సిందే.