చంద్రబాబుకు మూడు టెన్షన్లూ ఇవే… సాయంత్రానికి ఫ్యూచర్ పై క్లారిటీ!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు ఈ రోజు రెండు టెన్షన్ లు ఉన్నాయి! ఇప్పటివరకూ ఏ పిటిషన్ లోనూ తీర్పు వెలువడకపోవడంతో బాబు & కో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో ఈ రోజు రెండు కీలక పరిణామాలు ఉన్నాయి.

అవును… ఏపీ హైకోర్టులో అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన వారు ఇప్పటికే చాలా మంది బెయిల్ తీసుకున్నప్పటికీ బాబు లైట్ తీసుకున్నారనే కామెంట్లు అప్పట్లో వినిపించాయి. అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రిమాండ్ కి వెళ్లిన అనంతరం బాబు ఏ మాత్రం రిస్క్ తీసుకోవాలని భావించడం లేదని అంటున్నారు.

దీంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు తో పాటు, అంగళ్లు అల్లర్ల కేసులో కూడా ముందస్తు బెయిల్ కు పిటిషన్స్ వేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఈ కేసు ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో 14 రోజుల రిమాండ్ ముగింపు దశకు వచ్చిన పేపథ్యంలో… ఈ బెయిల్ పిటిషన్ పై ఆసక్తి నెలకొంది.

ఇదే సమయంలో చంద్రబాబును మరింతగా విచారించాల్సిన అవసరం ఉందని, స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో డబ్బు ఎక్కడికి చేరిందనే విషయంపై తమకు సమాచారం ఉందని, ఫలితంగా బాబును ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం వాదనలు పూర్తయ్యాయి. అయితే ఈ తీర్పు ఈ రోజు వెలువడనుంది.

దీంతో అంగళ్లు కేసులో ఏ1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణతో పాటు, ఏపీ సీఐడీ వేసిన ఐదురోజుల కస్టడీ పిటిషన్ తీర్పు కూడా ఈ రోజు వెలువడుతుండటంతో… టీడీపీ శ్రేణులు తీవ్ర ఒత్తిడితో ఎదురుచూస్తున్నారని అంటున్నారు! ఏమి జరుగుతుందనేది మరికొద్ది గంటల్లో క్లారిటీ రావొచ్చు!!

మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పైనా ఈ రోజు హైకోర్టులో విచారణ జరగబోతోన్న సంగతి తెలిసిందే.