స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ లపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.
ఈ సమయంలో తన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్ పై తమ వాదనలు బలంగా వినిపించేందుకు చంద్రబాబు కోసం మరో ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు కూడా సిద్ధమవుతున్నారు!
చంద్రబాబుని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ ఆయన తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 18 వరకూ కౌంటర్ దాఖలు చేసేందుకు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. ఆ గడువు పూర్తయిన నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో నేడు తదుపరి విచారణ జరగనుంది.
మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ తోపాటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ పైనా విచారణ జరగనుంది. ఈ సమయంలో బాబు తరుపున ఈ కేసులు వాదించడానికి సిద్ధార్థ్ లూథ్రాతో పాటు ఇంకో ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా రంగంలోకి దిగుతున్నారని తెలుస్తుంది.
నేడు విచారణ జరగనున్న క్వాష్, బెయిల్, మద్యంతర బెయిల్ పిటిషన్ లపై చంద్రబాబు తరుపున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాతో పాటు హారీశ్ సాల్వే, సిద్ధార్ధ్ అగర్వాల్ లు రంగంలోకి దిగనున్నారు. మరోపక్క ఏపీ సీఐడీ తరుపున ముకుల్ రోహిత్గీ, రంజిత్ కుమార్ లు తమ వాదనలు వినిపించబోతున్నారు!
దీంతో ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు కోసం రంగంలోకి దిగినట్లయ్యింది. మరోపక్క హారీశ్ సాల్వే ఫ్రాన్స్ లో ఉన్నారంట. అయినప్పటికీ వర్చువల్ గా అయినా వాదనలు వినిపించాలని టీడీపీ లీగల్ సెల్ కోరిన నేపథ్యంలో అందుకు ఆయన అంగీకరించారని అంటున్నారు.
ఈ మేరకు ఇప్పటికే న్యయముర్తికి విన్నపం అందిందని, అందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. దీంతో కస్టడీ ఇస్తారా? రిమాండ్ పొడిగిస్తారా? బెయిల్ దొరుకుతుందా? అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.