ఢిల్లీకి చంద్రబాబు.! ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ.?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోడీతో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొననున్నారు.అ దీ ఢిల్లీలో. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు చంద్రబాబు ఈ నెల 6న ఢిల్లీకి వెళ్ళనున్నారు.
2014 ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ పొత్తులో వున్నప్పుడు, ఆ పొత్తు నాలుగేళ్ళు కొనసాగిన నేపథ్యంలో తరచూ నరేంద్ర మోడీ – చంద్రబాబు మధ్య సమావేశాలు జరిగేవి. ఎప్పుడైతే బీజేపీతో చంద్రబాబు విభేదించారో, ఆ తర్వాత ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరకడం చంద్రబాబుకి కష్టమైపోయింది.
ఇటీవల భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికిగాను చంద్రబాబుకి ఆహ్వానం అందినా, చంద్రబాబు వెళ్ళలేదు. వెళ్ళి వుంటే, అదే వేదికపై చంద్రబాబు – ప్రధాని నరేంద్ర మోడీ కలిసేందుకు ఆస్కారం ఏర్పడి వుండేది.
ఆ సంగతి పక్కన పెడితే, ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమాలకు సంబంధించిన జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబుకి ఆమ్వానం పంపింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు.
ఈ అత్యద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు వున్నట్లు తెలుస్తోంది. మోడీతో ప్రత్యేకంగా అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిస్తే, రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోగలమని చంద్రబాబు, ప్రధాని మోడీకి చెప్పబోతున్నారట.