బాబు ఢిల్లీ టూరు వేళ… వారాహి యాత్రలో బీజేపీ పాత్ర?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారింది. జనసేనతోనే తమ పొత్తు అని, టీడీపీ ఇంకా కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఊహించని విధంగా చంద్రబాబుకు ఢిలీ బీజేపీ పెద్దలు అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఏపీలో పొత్తుల వ్యవహారంతో మరోసారి చర్చనీయాంశమైంది.

ఏపీలో పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారడం.. ఇప్పటికే జనసేన అధినేత తన వారాహి యాత్రను మొదలుపెట్టబోతుందండంతో.. తాజాగా చంద్రబాబు ఢిల్లీ యాత్ర టూర్ పై రకరకాల విశ్లేషణలు మొదలైపోయాయి. పైగా అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారంటే… కచ్చితంగా పొత్తుల టాపిక్ ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పనిలేకుండా.. ప్రయోజనం లేకుండా అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వరనేది వారు గుర్తుచేస్తున్న విషయం.

ఈ సమయంలో పవన్ వారాహి యాత్ర తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటికే బీజేపీ జనసేన మిత్రపక్షాలన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మిత్రపక్షాలుగా ఉండీ ఏనాడూ ఉమ్మడి కార్యక్రమాలు చేసిందిలేదు. ఎన్నికల్లో కూడా సహకరించుకున్నది లేదు. ఇదో రకం డిఫరెంట్ స్నేహం!! ఎంతసేపూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకవైపు పవన్ – మరోవైపు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విడివిడిగా మీడియా సమావేశాలు పెడుతు సభలు నిర్వహిస్తుంటారు అంతే!

అయితే ఈ సమయంలో పవన్ వారాహి యాత్రలో బీజేపీ నేతలకు ఆహ్వానం ఉంటుందా అనేది కీలకంగా మారింది. జనసేన జెండాల మధ్య కాషాయ కండువాలు కనిపిస్తాయా అనేది ఆసక్తిగా మారింది. పైగా ఈ యాత్ర తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రారంభం కాబోతుండగా… సోము వీర్రాజుది కూడా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రే కావడం గమనార్హం. దీంతో… సోము కూడా పవన్ తో పాటు వారాహి వాహనంపై ఉంటారా అన్నది ఆసక్తిగా మారింది.

అయితే చంద్రబాబు ఢిలీ యాత్ర ముగిసిన అనంతరం.. ఏపీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు ఫేస్ ఫీలింగ్స్ని బట్టి, మాట తీరులో తేడాను బట్టి… వారాహి యాత్రలో ఏపీ బీజేపీ పాత్ర ప్రమేయం ఉంటుందా లేదా అనేది తెలుస్తుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. అక్కడ బాబు కోరిక నిజం అయితే… ఇక్కడ లెక్కలు మారతాయి. జనసేన – బీజేపీ మధ్య కౌగిలింతలే కౌగిలింతలు. అలాకానిపక్షంలో… వారాహికీ బీజేపీకీ ఏమీ సంబంధం లేదు!!