టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జులను, కమిటీలను ఏర్పాటుచేసిన ఆయన నియోజకవర్గాల మధ్యన నాయకుల మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. గత ఎన్నికల్లో ఎవరైతే ఓడిపోయారో వారిని స్థానభ్రంశం చెందిస్తే ఎలా ఉంటుందనే విషయమై కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళగిరి నుండి తన కుమారుడు లోకేష్‌ను తప్పించి మహిళా నేతను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఆమే పంచుమర్తి అనురాధ. సుదీర్ఘ కాలం నుండి టీడీపీల కొనసాగుతున్న మహిళా నేత. ఎప్పటికప్పుడు పార్టీ పట్ల విధేయతను ప్రూవ్ చేసుకుంటున్నా కూడ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు.
గత ఎన్నికల్లోమంగళగిరి టికెట్ ఆశించినా లోకేష్ కోసం ఆమెను పక్కనపెట్టారు. కానీ ఈసారి మాత్రం ఆమెను అదృష్టం వరిస్తుందని అంటున్నారు పార్టీ నేతలు. ఎందుకంటే లోకేష్ ను వచ్చే ఎన్నికల్లో పెదకూరపాడు అసెంబ్లీ స్థానం నుండి బరిలో నిలపాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దూకుడు మామూలుగా లేదు. రోజురోజుకూ ఆయన పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార టీడీపీ మీద ఎలా విరుచుకుపడేవారో ఇప్పుడు కూడ అలాగే ఉన్నారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబుకు అడ్డం పడుతున్నారు. లోకేష్ ఆయన ముందు దాదాపుగా తేలిపోయారనే అనాలి.
అందుకే లోకేష్ స్థానాన్ని పంచుమర్తి అనురాధకు ఇవ్వాలని చూస్తున్నారట. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన అనురాధపై పార్టీ కేడర్లో మంచి పేరుంది. కష్టించి పనిచేస్తారనే గుర్తింపు ఉంది. బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో పద్మశాలి వర్గం కూడ ఎక్కువగానే ఉంది. అందుకే అనురాధ అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఢీకొట్టడానికి సరైన అభ్యర్థి అని చంద్రబాబు భావిస్తున్నారట. ఎన్నాళ్ళ నుండి మంగళగిరి నుండి బరిలోకి దిగాలని ఆశపడుతున్న అనురాధ ముందు జాగ్రత్తగా అక్కడి కేడర్ మీద పట్టు సాధించడం, లోకల్ నాయకులతో కలుపుగోలుగా ఉండటం చేస్తూ వస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆక్షేపించేవారు కూడ ఎవరూ లేరు. అందుకే ఆమెను నిలబెట్టి కాస్త కష్టపడితే గెలవచ్చనేది వ్యూహం. మరి కుమారుడ్ని గెలిపించలేకపోయిన చోట మహిళా నేతను గెలిపించగలరేమో చూడాలి.