మహానాడు సభ వేదికగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి భవిష్యత్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన 100 శాతం, టీడీపీ 98 శాతం స్ట్రయిక్ రేట్‌తో గెలుపొందిన విజయం తత్ఫలితంగా కూటమికి ప్రజలు భారీ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. మొదట్లో విమర్శించినవారు కూడా ఇప్పుడు ఆశ్చర్యంతో చూస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు మాట్లాడుతూ, మండల స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి నేతలంతా కలిసే ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. “ఒక కొండను ఢీకొట్టాలంటే నాయకులంతా శక్తివంతంగా ఉండాలి,” అని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కూటమిగా పని చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు ప్రజల వరకూ చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
“మేము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా అమలు చేస్తాం. నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు ఇచ్చిన హామీలను కూడా ముఖ్యమంత్రి నైతిక బాధ్యతగా తీసుకుంటాను. ప్రజల్లో ప్రభుత్వం మీద నమ్మకాన్ని పెంచేందుకు ప్రతి మాట నిలబెట్టుకుంటాం,” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
టీడీపీని రాజకీయ యూనివర్సిటీగా అభివర్ణించిన చంద్రబాబు, విలువలు, విశ్వసనీయత, పారదర్శకత పార్టీ సూత్రాలు అని చెప్పారు. “వైసీపీ పాలన హత్యా రాజకీయాలకు, కక్ష సాధింపు చర్యలకు నిలయంగా మారింది. కానీ మేము అవినీతి రహిత పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకుంటాం,” అంటూ ఆయన తేల్చిచెప్పారు.