మరో మేనిఫెస్టోకు టీడీపీ కసరత్తు… ఈసారి కొత్త హామీలివే!

ఈసారి జరగబోయే ఎన్నికల్లో 2019 ఫలితాలు రిపీట్ అయితే ఇక టీడీపీ మనుగడ ప్రశ్నార్థకమే అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో గెలవకపోతే అవే తనకు చివరి ఎన్నికలు అని బాబు గతంలో చెప్పుకొచ్చారు కూడా. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా రెండో విడత మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తున్నారు.

ఎన్నికలకు చాలా ముందుగానే మినీ మేనిఫెస్టోను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరో అడుగు ముందుకేయనుంది. భవిషత్తుకు గ్యారెంటీ పేరిట విడుదల చేసిన మొదటి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు వివిధ వర్గాలకు చెందిన ప్రజలను ఆకర్షించేందుకు సూపర్‌సిక్స్‌ పాలసీలను ప్రకటించారు. అయితే ఆ మేనిఫెస్టో ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే కామెంట్లు వినిపించాయి. ఆ మేనిఫెస్టోను అధికార పక్షం సీరియస్ గా తీసుకోలేదు సరికదా… దాని రూపకల్పనపై సెటైర్లు వేసింది.

కర్ణాటక రాష్ట్రంలో ఫేమస్ అయిన హామీలతో పాటు.. ఏమాత్రం ఆలోచన లేకుండా జగన్ పథకాలను సైతం పేరు మార్చి, అర్హతలు మార్చి, వాటిని ఎక్స్ పేండ్ చేస్తూ ప్రకటించేశారంటూ ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో… ఆన్ లైన్ వేదికగా ట్రోలింగ్స్ కూడా ఎక్కువగా జరిగాయి. ఈ క్రమంలో… మొదటి విడత మేనిఫెస్టోపై వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోని టీడీపీ… ఇప్పుడు రెండో మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇందులో భాగంగా… ఈ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీపై కీలక హామీలున్నాయని తెలుస్తోంది. రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు పెద్ద మొత్తంలో రుణ మాఫీ హామీ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పథకాలను ప్రకటించడంతో పాటు, ఉపాధి కల్పనపై మేనిఫెస్టోలో చర్చించనున్నారట. ఫలితంగా… రైతులు, మహిళలకు వరాలు కురిపించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇదే సమయంలో మొదటిమేనిఫెస్టోపై వచ్చిన కాపీ పేస్ట్ కామెంట్లు పార్ట్ – 2 లో రాకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. వీటిలో మరి ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైనే మరోసారి దృష్టి పెట్టారని కథనాలొస్తున్నాయి. మరి ఈ టీడీపీ మేనిఫెస్టో – 2 ప్రజల్లో చర్చ జరిగే స్థాయిలో రూపొందుతుందా.. లేక, మరోసారి కంట్రో సి – కంట్రోల్ వి కామెంట్లకు బలవుతుందా అనేది వేచి చూడాలి.