ష్యూరిటీ, గ్యారెంటీ… చంద్రబాబుకు ఎంత కష్టమొచ్చింది?

ఒక మనిషి నమ్మకం కలిగించుకోవాలంటే చాలా కాలమే కష్టపడాలి. ఒక సారి ఆ నమ్మకం కొల్పోతే తర్వాత తలకిందులుగా ఎన్ని తపస్సులు చేసినా మళ్లీ ఆ నమ్మకం తిరిగి సంపాదించుకోవడం కష్టం. సామాన్యుల విషయంలోనే పరిస్థితి అంత కష్టంగా ఉంటే… ఇక నాయకుల విషయంలో అయితే చెప్పే పనిలేదు! ప్రస్తుతం చంద్రబాబు ఆ ఫేజ్ నే ఎదుర్కొంటున్నారు.

చంద్రబాబు ఏపీ ప్రజల వద్ద ఎంతలా నమ్మకం కోల్పోవాలో అంతా కోల్పోయారు. ఇప్పుడు తలకిందులుగా తపస్సు చేసినా అది తిరిగి సంపాదించుకోవడం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో… ఆ తలకిందుల తపస్సుల్లో భాగంగా… ష్యూరిటీ సంతకం పెడతాను.. గ్యారెంటీ బాండ్స్ ఇస్తాను అంటూ తిరగనున్నారు బాబు & కో!

నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ.. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు… ఈ దశలో జనాలు తనను నమ్మడం లేదని బలంగా నమ్ముతున్నారు! దీంతో… ష్యూరిటీ, గ్యారెంటీపై ఏకంగా ప్రచారమే మొదలు పెట్టారు. తాను సంతకాలు చేసిన ష్యూరిటీ బాండ్ పేపర్ ని రాష్ట్ర ప్రజలందరికీ పంచి పెట్టే కాకర్యక్రమం చేపట్టారు

అలా అని ఏ 100 రూపాయల బాండ్ పేపర్ మీదో ష్యూరిటీ ఇస్తున్నారనుకుంటే పొరపాటే… చంద్రబాబు సంతకం ఉన్న ఓ కరపత్రం మాత్రమే ఇస్తారు. దానికి స్యూరిటీ గ్యారెంటీ అని పేరు మాత్రం పెట్టుకున్నారు. సెప్టెంబర్-1 నుంచి ఈ “బాబు ష్యూరిటీ – భవిష్యత్‌ కు గ్యారెంటీ” కార్యక్రమం మొదలవుతుంది.

సుమారు రాష్ట్రమంతా ఈ కరపత్రాలు పంచాలని టీడీపీ అధిష్టాణం భావిస్తోంది. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పలువురు చెబుతున్నా… పోతే వెంట్రుక, వస్తే కొండ అనేలా అయినా ఆలోచించి ముందుకు కదలాలని చెబుతున్నారట! సుమారు 45రోజులపాటు “ష్యూరిటీ – గ్యారెంటీ” పథకం డిజైన్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు అంతా ప్రజల వద్దకు వెళ్లి తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తారు. ఈ పథకాల వల్ల ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు.. రాష్ట్రంలో ప్రతీరోజూ దాదాపు 3వేలమందిని నేరుగా కలుస్తారని అంటున్నారు చంద్రబాబు.

ఆ కష్టం సంగతి అలా ఉంటే… ఇప్పటికే “స్త్రీ శక్తి” పేరుతో రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా… మినీ మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తామని చెబుతున్నారు చంద్రబాబు. పైగా… టీడీపీ పూర్తి మేనిఫెస్టో బయటకు వస్తే అధికార వైసీపీకి వణుకు పుడుతుందని చెబుతుండటం గమనార్హం.