టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని కాస్త అటు ఇటుగా ఆయనే స్వయంగా వర్చువల్ విచారణలో న్యాయమూర్తికి తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడిగా సీఐడీ పేర్కొన్న చంద్రబాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ క్రమంలో… సీఐడీ తనపై ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్టును, ఆ కేసును కొట్టి వేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. మరోవైపు రెండు రోజుల సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇది టీడీపీ నాయకులను, మద్దతుదారులను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలో ప్రస్తుతం బాబు విచారణ జైల్లో జరుగుతుంది.
ఆ సంగతి అలా ఉంటే… ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో శనివారం సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధపడుతున్నారని కథనాలొచ్చాయి. ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అది సరైన ఆలోచన కాదని బాబుకు కొంతమంది సన్నిహితులు సూచించినట్లు తెలుస్తుంది.
అవును… ఈ కేసు విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారు సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. వారు ప్రస్తుతం టీడీపీకి సంబంధంలేని వారే అయినప్పటికీ మొదటి నుంచి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అని అంటున్నారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ఉన్నత పదవిలో ఉన్నవారు సైతం అలాంటి సలహానే ఇచ్చారనే వార్తలు మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.
అందులో భాగంగా… సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒకరు, న్యాయ వ్యవస్థ గురించి గరిష్టంగా తెలిసిన వ్యక్తి ఇంకొకరు చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి వారు చెబుతున్న కారణం కూడా లాజికల్ గా ఉందని అంటున్నారు.
ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడానికి బలంగా సపోర్ట్ చేసిన వాటిలో… ఏపీ సీఐడీ లాయర్లు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రముఖంగా ప్రస్థావించారని అంటున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు తలుపుతడితే అక్కడ కూడా ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టులో చెప్పిన కారణాలే అక్కడా చెప్తారు. దీంతో అక్కడా సేం సీన్ రిపీట్ అవ్వుద్ది అని చెబుతున్నారంట.
పైగా ఈ కేసులో ఈడీ, ఐటీ, జీఎస్టీ సంస్థల దర్యాప్తుతో ముడిపడిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి మొదటికే మోసం వచ్చే ప్రమాధం కూడా లేకపోలేదని చెబుతున్నారు. కారణం… ఒక్కసారి సుప్రీం కోర్టులో బాబు పిటిషన్ తిరస్కరణకు గురైతే.. బాబు ఇమేజీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండటమేనట!
కానీ… చంద్రబాబు కుటుంబ సభ్యులు మాత్రం ఆ ఉచిత సలహాను స్వీకరించలేదని తెలుస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు తరుపున న్యాయవాదులు సుప్రీంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.