చంద్రబాబునాయుడు వాడకం మళ్ళీ మొదలైంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా అందుకే ఎన్టీయార్ బొమ్మకు మళ్ళీ మోక్షం వచ్చింది. నెల్లూరులో జరిగిన ధర్మపోరాట సభలో తెలుగుదేశంపార్టీ వ్యవస్ధాపకుడు నందమూరి తారక రామారావు ఫొటోను ప్రముఖంగా కనిపించేట్లుగా ప్రదర్శించారు. అదికూాడా చంద్రబాబు, లోకేష్ కన్నా కొట్టొచ్చినట్లు పెద్దదిగా . ధర్మపోరాటసభలో వేదిక మీద ఏర్పాటు చేసిన బ్యాక్ డ్రాప్ ఫొటోలో చంద్రబాబుతో పాటు ఎన్టీయార్ ఫొటో కూడా కనిపించటం అందరినీ ఆశ్చర్యపరిచింది. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం అంటూ బ్యానర్ పై రాసి అందులో ఎన్టీయార్ ఫొటోను పెట్టటమే విచిత్రంగా ఉంది.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అప్పటికప్పుడు ఎన్టీయార్ బొమ్మకు బూజు దులుపుతారు చంద్రబాబు. అంతకుముందు వరకూ ఎన్టీయార్ ప్రస్తావనను ఏదో మొహమాటానికి మాత్రమే ప్రస్తావించేవారు. ఏ సభ జరిగినా లేకపోతే వేదిక ఏదైనా సరే బ్యాక్ గ్రౌండ్ లో ఫొటోలు చంద్రబాబు, నారా లోకేష్ వి మాత్రమే దర్శనమిస్తాయి. మొహమాటానికి కూడా ఎన్టీయార్ ఫొటో కనబడదు. అలాంటిది హఠాత్తుగా నెల్లూరు ధర్మపోరాటసభ వేదికలో ఎన్టీయార్ ఫొటో ఎందుకు కనిపించినట్లు ? ఎందుకంటే, త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే.
తెలంగాణా ఎన్నికల సందర్భంగా చంద్రబాబును శాపనార్ధాలు పెట్టని ఎన్టీయార్ అభిమానులు ఉండరు. కారణం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటమే. తెలుగుదేశంపార్టీని ఎన్టీయార్ ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. అటువంటిది భవిష్యత్తులో తనకు సమస్యలు తలెత్తితే ఏదో ఓ జాతీయ పార్టీ అండ అవసరమన్న దూరాలోచనతోనే చంద్రబాబు నిసిగ్గుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. దాంతో ఎన్టీయార్ అభిమానులందరూ చంద్రబాబుపై మండిపోతున్నారు. పార్టీలో కూడా పాతతరం నాయకులకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు. కాకపోతే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చాలామంది నోరెత్తటం లేదు.
కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో పార్టీలోను, బయట జరుగుతున్న పరిణామాలను గ్రహించిన చంద్రబాబుకు హఠాత్తుగా ఎన్టీయార్ ఫొటో గుర్తుకు వచ్చింది. దాంతో వేదిక బ్యాక్ డ్రాప్ లో అన్నగారి ఫొటో కూడా కనిపించింది. ప్రముఖంగా కనిపించిన ఎన్టీయార్ ఫొటోను చూసిన చాలామంది ముందు ఆశ్చర్యపోయారట. తర్వాత ఎన్నికలు వస్తున్న విషయం గుర్తుకు వచ్చి తమకు తాము సర్దిచెప్పుకున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ధర్మపోరాట సభల్లో ఎక్కడ కూడా ఎన్టీయార్ ఫొటోను వాడింది లేదు. గతంలో కూడా పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాల్లో కూడా ఎన్టీయార్ బొమ్మను తీసేసిన ఘనుడు చంద్రబాబు. అన్నీ వైపుల నుండి విమర్శలు మొదలైతే తర్వాత ముద్రించిన పుస్తకాల్లో మళ్ళీ ఎన్టీయార్ బొమ్మను ముద్రించారు.