ఎన్నికలకు ముందు- చంద్రబాబు నాయుడు మైండ్‌గేమ్ ఆరంభించారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్లు పోయి, పోయి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకుని ఆయన తన పొలిటికల్ గేమ్‌ను స్టార్ట్ చేశారు. తాను ఏదైనా ఓ మాట విసిరితే..ఎంతటి వారైనా దానికి తల ఊపాల్సిందే అనేది చంద్రబాబు మైండ్‌సెట్.
తల ఊపలేదా? అది ప్రధాని అయినా సరే! తాను చేసే విమర్శలకు లేదా మైండ్‌గేమ్‌కు నిర్దాక్షిణ్యంగా బలి చేస్తారు. చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తరువాత మోడీ ఈ విషయం బాగా అర్థమై ఉంటుంది. అసలు విషయానికి వస్తే- పవన్ కల్యాణ్ తమతో కలిసి రావాలంటూ చంద్రబాబు బహిరంగంగా ఆహ్వానించారు.
రాష్ట్ర క్షేమం కోరి, వచ్చే ఎన్నికల్లో పవన్ తమతో పొత్తు పెట్టుకోవాలని బహిరంగ సభలో పిలుపు ఇచ్చారు. ఏ ఉద్దేశంతో చంద్రబాబు ఈ పిలుపు ఇచ్చారో.. అర్థం చేసుకోలేకపోయారు పవన్ కల్యాణ్. తాము వామపక్షాలతో తప్ప మరెవరితోనూ కలిసి ఎన్నికల్లో పోటీ చేయమని, వీలైతే 175 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెడతామనీ అన్నారు. తాను ఆహ్వానిస్తే, తోసిపుస్తారా? అనే భావం చంద్రబాబు అహాన్ని దెబ్బతీసినట్టయింది.
ఇక అక్కడి నుంచి మొదలైంది చంద్రబాబు నాయుడు మైండ్‌గేమ్. కాపు కులానికే చెందిన మంత్రి నారాయణతో చెప్పించారు. తన పార్టీలో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులను రంగంలోకి దింపారు. తమతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా పదే, పదే చెప్పించారు.
ఈ విషయాన్ని చంద్రబాబు తన అనుకుల మీడియాతో జనంలోకి తీసుకెళ్లగలిగారు. ఈ వ్యవహారం పవన్ కల్యాణ్‌ను పూర్తిగా గందరగోళంలోకి నెట్టేసింది. ఆయనను ఆత్మరక్షణలో పడేసింది. తాను పొత్తు పెట్టుకోను బాబోయ్ అని చెప్పుకోవడానికే సరిపోయింది. చంద్రబాబుకు కావాల్సింది కూడా అదే.
వాస్తవానికి- పవన్ కల్యాణ్ మనస్తత్వం కాస్త అస్థిరమైనదే. ఈ విషయం ఆయన మాటల్లో, ప్రసంగాల్లో కనిపిస్తుంటుంది. ఆవేశం ఎక్కువ..ఆలోచన తక్కువ అని చెబుతుంటారే అలాగన్న మాట. బహిరంగ సభల్లో అభిమానులను చూస్తే ఆయనకు ఎక్కడా లేని ఆవేశం గుర్తుకొస్తుంది. ఆవేశంతో ఊగిపోతారు. ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఈ నాడీని చంద్రబాబు పట్టుకోగలిగారు. దాన్నే తన బలంగా మార్చుకున్నారు. పవన్ కల్యాణ్‌ను గందరగోళంలో పడేయగలిగారు.
తాజాగా- టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ చేసిన కామెంట్స్ కూడా మైండ్‌గేమ్‌లో ఓ భాగమే. పొత్తులు ఖాయమని, సీట్ల పంపకాలే తరువాయి అంటూ టీజీ వెంకటేష్ చేసిన ఓ ప్రకటనపై పవన్ కల్యాణ్ తనదైన ఆవేశంతోనే విరుచుకుపడ్డారు. అదే గందరగోళాన్ని ప్రదర్శించారు. టీజీ వెంకటేష్‌పై విమర్శలు గుప్పించారు.
తాను వదిలేసిన రాజ్యసభ సీటును టీజీ వెంకటేష్ అనుభవిస్తున్నారని ఓ అన్‌మెచ్యూర్డ్ కామెంట్ చేశారు. దీనిపై టీజీ కూడా స్పందించారు. `టీవీల్లో వచ్చిన స్క్రోలింగ్‌లను చూసి, స్పందించే వాడివి. నువ్వూ ఓ పొలిటీషియనేనా..! అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రత్యర్థితో ఈ రకంగా మైండ్‌గేమ్ ఆడటంలో చంద్రబాబు ఘనుడు.