రిజర్వేషన్ల పేరుతో  అగ్రవర్ణాల మధ్య కొత్త పంచాయితీ

అగ్రవర్ణాల్లోని పేదల మధ్య చంద్రబాబునాయుడు పంచాయితీ పెట్టారు. కేంద్రప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు  10 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఆ సౌకర్యాన్నే రాబోయే ఎన్నికల్లో లబ్దిపొందటానికి చంద్రబాబు ప్లాన్ వేశారు. ఇంతకీ చంద్రబాబు చేసిందేమిటంటే, 10 రిజర్వేషన్ సౌకర్యాన్ని రెండుగా విడదీశారు. అందులో 5 శాతం కాపుల్లోని పేదలకు మిగిలిన 5 శాతం అగ్రవర్ణాల్లోని పేదలకు వర్తింపచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించుకున్నారు. అంటే చంద్రబాబు తాజా నిర్ణయం ఫక్తు రాజకీయంగా లబ్దిపొందేందుకే అన్నది స్పష్టంగా తెలిసిపోతోంది.

నిజానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా రాజకీయంగా లబ్దిపొందేందుకే అన్నదానిలో ఎటువంటి అనుమానం లేదు. అటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకునేందుకు అగ్రవర్ణాల్లోని పేదల మధ్య మరింతగా మంటలు పెట్టేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే కాపులు, బిసిలకు ఏమాత్రం పడటం లేదు. పోయిన ఎన్నికల్లో కాపుల ఓట్లను కొల్లగొట్టేందుకు కాపులను బిసిల్లో చేరుస్తాననే ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని చంద్రబాబు మరచిపోవటంతో రాష్ట్రంలో ఎంత గొడవైందో అందరూ చూసిందే.

తమను బిసిల్లో చేర్చాలని కాపులు ఒకవైపు, కాపులకు రిజర్వేషన్లు వర్తింపచేసేందుకు వీల్లేదంటూ బిసిలు మరోవైపు చేసిన ఆందోళనలతో రాష్ట్రం అప్పట్లో అట్టుడుకిపోయింది. సరే తర్వాత చంద్రబాబు ఆడిన  డ్రామా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మళ్ళీ షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ? అందుకే కాపుల ఓట్లు ఎలా వేయించుకోవాలో అర్ధంకాక అయోమయంలో పడ్డారు. ఇంతలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అంటూ కేంద్రం ఎన్నికల డ్రామాకు తెరలేపింది. దాన్నే తనకు అనుకూలంగా మలుచుకోవాలని చంద్రబాబు వెంటనే ప్లాన్ వేశారు. అందులో భాగమే కొత్త పంచాయితీ.

చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో అగ్రవర్ణాల్లోని కాపులకు, మిగిలిన వర్ణాలకు మధ్య మంటలు రేగటం ఖాయం. నిజానికి కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రాలు యధాతధంగా అమలు చేయాల్సిందే కానీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. చంద్రబాబుపై మండిపోతున్న కాపులు  వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓట్లేసేది అనుమానమే. ఇటువంటి పరిస్ధితుల్లో  ఓట్ల కోసం ఏ హామీ ఇచ్చినా కాపులు నమ్మేట్లులేరు. కాపులు వ్యతిరేకమైతే వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చేది అనుమానమే. ఈ విషయం స్పష్టమవటంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే మళ్ళీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పొత్తుల కోసం గోకుతున్నారు.

ఈ నేపధ్యంలోనే కేంద్రం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయంపై చంద్రబాబు దృష్టిపడింది. ఇంకేముంది ? చక్కగా తన ప్లాన్ ను అమలు చేయటానికి నిర్ణయించుకున్నారు. 10 శాతం రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని మళ్ళీ కాపుల ఓట్ల కోసం సరికొత్త ప్లాన్ వేశారు. అందులో భాగమే కాపుల్లోని పేదలు, ఇతర అగ్రవర్ణాలు అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు. ఎవరెలా కొట్టుకుని చచ్చినా చంద్రబాబుకు బాధలేదు. చంద్రబాబుకు కావాల్సింది మళ్ళీ అధికారంలోకి రావటమే. అందుకోసం ఎంతమంది మధ్య అయినా మంటలు పెడతారు.  మరి, చంద్రబాబు నిర్ణయం ఏ మేరకు అమలవుతుంది ? కాపులు ఎంత వరకూ చంద్రబాబు నమ్ముతారో చూడాల్సిందే