సుప్రీంలో బాబు క్వాష్ పిటిషన్… వాదనలు జరిగిన తీరిది!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ఈ రోజు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది లతోకూడిన బెంచ్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా… చంద్రబాబు తరుపున తొలుత లాయర్‌ హరీష్‌ సాల్వే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినిపించారు. బాబు తరుపున ఈయనతో పాటు మరో ముగ్గురు సీనియర్ న్యాయవాదులు ఈ పిటిషన్ పై వాదనలు వినిపించారు!

అవును… చంద్రబాబు తరపున తొలుత వాదనలు వినిపించిన లాయర్‌ హరీష్‌ సాల్వే… గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తిస్తుందని తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన తీరు సరైంది కాదని అన్నారు. ఈ కేసు విచారణను సెప్టెంబర్‌ 7, 2021న ప్రారంభించినట్టు ఏడీజీపీ లేఖను బట్టి తెలుస్తోందని కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలో సాల్వే వాదనలపై జస్టిస్‌ త్రివేదీ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ నేరం 2015-16 మధ్య జరిగినప్పుడు 2018లో జరిగిన 17ఏ చట్ట సవరణ ఏ రకంగా వర్తిస్తుందని అడిగారు. దీనిపై స్పందించిన సాల్వే… కేసు అప్పుడు నమోదైనాప్పటికీ, చంద్రబాబు అరెస్ట్‌ ఇప్పుడు చేశారు కాబట్టి కచ్చితంగా సెక్షన్‌ 17ఏ దీనికి వర్తించాలని.. విచారణ ప్రారంభమైన తేదీనే ప్రామాణికంగా తీసుకోవాలని వాదించారు.

అనంతరం చంద్రబాబు తరపున మరో సీనియర్‌ లాయర్‌ సింఘ్వీ ఎంట్రీ ఇచ్చారు. రఫెల్‌ కేసు సమయంలో యశ్వంత్‌ సిన్హా కేసును ఈ సందర్భంగా సింఘ్వీ ఉదహరించారు. అనంతరం జస్టిస్‌ జోసెఫ్‌ ఇచ్చిన తీర్పును చదివి వినిపించారు.

అనంతరం సీఐడీ తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా… ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయిందని, అప్పట్లోనే సీబీఐ దీన్ని పరిశీలించిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాకముందు దర్యాప్తు జరిగిన కేసులపై ఈ ప్రభుత్వానికి రాజకీయ కక్ష సాధింపు అని ఎలా ఆపాదిస్తారంటూ ప్రశ్నించారు.

అనంతరం స్పందించిన సింఘ్వీ… ఒకసారి కేసును పరిశీలిస్తే ఇది కేవలం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే అభియోగాలున్నాయని తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించిన బెంచ్… మేము కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు.. ఇప్పటికిప్పుడు కేసును క్వాష్‌ చేయాలన్న అంశంపైనా ఆసక్తి చూపించడం లేదు అని స్పష్టం చేశారు.

ఈ సమయంలో కల్పించుకున్న ముకుల్ రోహిత్గీ… ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ని ప్రారంభించారని తెలిపారు. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలని, 90% మరో సంస్థ గిఫ్ట్‌ గా ఇస్తుందని తెలిపారని, దీంతో.. వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయనీ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో… 2017కంటే ముందే నేరం జరిగింది.. 2018 జులైలో చట్టసవరణ వచ్చింది.. 2021లో ఎఫ్.ఐ.ఆర్. నమోదయింది.. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే.. ఈ కేసులో ఏ రకంగానూ 17ఏ వర్తించదు అని తేల్చి చెప్పారు! ఇదే క్రమంలో… వీళ్లు కనీసం బెయిల్‌ అడగడం లేదు, ఏకంగా కేసును కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ వేశారని అన్నారు.

ఈ విధంగా వాడి వేడిగా సాగిన వాదనల అనంతరం స్పందించిన బెంచ్‌… క్వాష్‌ పిటిషన్‌ పై వాదనలను సోమవారం వింటామని తెలిపి.. హైకోర్టు ముందు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్లు అన్నీ సమర్పించాలని ఆదేశించింది.