బాబ్లీ నోటీసులపై బాబు స్ట్రాంగ్ రియాక్షన్

బాబ్లీ అరెస్ట్ వారెంట్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ నేరాలు ఘోరాలు చేయలేదన్నారు. ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందనే ఉద్దేశంతో నిరసన తెలపడిని బాబ్లీ వద్దకు వెళ్లామన్నారు. అయితే ఉమ్మడి రాష్ట్ర సరిహద్దుల్లోని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసారని గుర్తు చేశారు.

ఇప్పుడు అరెస్టు వారెంట్ పంపితే భయపడే వారెవరు లేరని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ పని చేసినా ప్రజల కోసమే చేశానన్న చంద్రబాబు… కేసులు నోటీసులతో నన్ను ఏమి చేయలేరని వెల్లడించారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో కింద ఉంది చూడండి.

నేను ఎక్కడా అన్యాయం చేయలేదు, లేకపోతే నేరాలు చేయలేదు ఘోరాలు చేయలేదు. ఆరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో బాబ్లీ ప్రాజెక్టులో ప్రాజెక్టు కడితే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని, ఇది కట్టడానికి వీలు లేదని, ప్రాజెక్టులో ప్రాజెక్టు కట్టడం తప్పని నిరసన తెలపడానికి వెళ్ళాము.

 ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. 8 సంవత్సరాలకంటే ముందు ఇది జరిగింది. ఆరోజు మేము వెళ్తుంటే బోర్డర్ లోనే మమ్మల్ని అరెస్టు చేశారు. అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. మేము ఏ తప్పు చేయలేదని ఆరోజే చెప్పాము. మీరు, మీ పోలీసులే కావాలని అరెస్టు చేసి తీసుకువచ్చారని, మీరు ఏం చేస్తారో చేయమని ఆరోజే నిర్మొహమాటంగా చెప్పాను.

మీ మీద కేసులు పెట్టలేదని చెప్పి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి హైద్రాబాదులో వదిలిపెట్టారు. ఇప్పుడు నోటీసులు పెట్టామని చెబుతున్నారు. అరెస్ట్ వారెంట్లు ఇచ్చామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆరోజు కూడా ఉత్తర తెలంగాణ దెబ్బ తింటుందని, తెలుగు జాతికి నష్టం వాటిల్లుతుందని ఈ పోరాటం చేశాము.

మీరంతా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజాహితం కోసం, ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్నాం. మీరంతా ఈ కేసు విషయంలో సహకరించాలి. దానిపై ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తాం అని అన్నారు చంద్రబాబు.