లోకేష్ రిపోర్ట్స్ చూసి చంద్రబాబే షాకయ్యారంటే కంగారుపడాల్సిన విషయమే !

Chandrababu Naidu happy with Nara Lokesh

తన తర్వాత పార్టీని తన కుమారుడు నారా లోకేష్ చేతిలో పెట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు. ఆ ప్రకారమే పక్క ప్లాన్ రెడీ చేసి లోకేష్ ను రాజకీయ రంగ ప్రవేశం చేయించారు. 2014లో ప్రభత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత లోకేష్ ను ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపకుండా ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రిని కూడ చేశారు. కానీ లోకేష్ చంద్రబాబు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. చీటికీ మాటికీ ప్రత్యర్థుల చేతికి దొరికిపోతూ తాను ఇబ్బందిపడటమే కాకుండా పార్టీని కూడ కష్టాల్లోకి నెట్టారు. ఇలాంటి వ్యక్తికా చంద్రబాబు నాయుడు పార్టీని అప్పగించాలనుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేసేవారు వైసీపీ నేతలు. సరిగా తెలుగు మాట్లాడటం కూడ రాని లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఇంకేమన్నా ఉందా అంటూ నెగెటివ్ ప్రచారం చేశారు. దాంతో లోకేష్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది.

పార్టీ ఓటమి కంటే కుమారుడి ఓటమి చంద్రబాబును తీవ్రంగా కలచివేసింది. అయినా పట్టు వదల్లేదు ఆయన. లాక్ డౌన్ సమయంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ హైదరాబాద్లోని నివాసానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆ గ్యాప్లో బాబుగారు లోకేష్ కు బ్రెయిన్ వాష్ చేసినట్టు ఉన్నారు. రాజకీయాల మీద పూర్తి అవగాహన కల్పించారు. దాంతో లోకేష్ పనితీరులో ఒక్కసారిగా పెను మార్పు మొదలైంది. గతంలో మాదిరి అన్నింటికీ తండ్రి పక్కన నిలబడటం కాకుండా తానే బాధ్యతలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఒంటరిగానే పర్యటనలు చేయడం స్టార్ట్ చేశారు. కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన నేతలను ఒక్కరే వెళ్లి పరామర్శించారు. వర్షాలతో నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లి మంచే చెడు కనుకకుంటున్నారు. పార్టీ వర్గాలతో సమావేశాలు జరుపుతూ ఎలా ముందుకెళ్లాలనే విషయంలో సొంత నిర్ణయాలను చెబుతున్నారు.

Chandrababu Naidu happy with Nara Lokesh
Chandrababu Naidu happy with Nara Lokesh

లోకేష్ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కూడ ఇంతకుముందులా పేలవంగా లేవు. వాటిలో కొంచెం విషయ పరిజ్ఙానం కనబడుతోంది. పాలక వర్గం సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలను సంధిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. ఏలూరులో జరిగిన సంఘటన మీద అందరికంటే ముందు మాట్లాడింది లోకేషే. పార్టీ శ్రేణులతో, కీలక నాయకులతో, ద్వితీయ శ్రేణి నేతలతో నిత్యం టచ్లో ఉంటున్నారట. దీంతో ఆయన మీద ఎప్పుడో ఆశలు వదిలేసుకున్న నాయకులు సైతం ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికైనా మారాడని, ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి తనతో పాటు పార్టీకి కూడ మంచి చేసిన వాడవుతాడని కితాబిస్తున్నారు.

చంద్రబాబు సైతం లోకేష్ పనితీరు మీద, ఆయన పట్ల పార్టీలో, ప్రజల్లో వస్తున్న స్పందన మీద ప్రత్యేక నిఘా పెట్టారట. నిఘా బృందాల నివేదికలో లోకేష్ పనితీరు మెరుగైనట్టు, ఇంతకుముందుకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు తేలిందట. అది చూసి లాక్ డౌన్ టైంలో ఇచ్చిన ట్రైనింగ్ ఫలించినందుకు సంతృప్తిగా ఉన్నారట ఆయన. మరోవైపు వైసీపీలో కూడ లోకేష్ మీద గతంలో ఉన్నట్టు చులకన భావన అయితే ఇప్పుడు లేదు. ఇంతకుముందులా ఆయన మాటలను సిల్లీగా తీసుకోలేకపోతున్నారు. వీలులైనప్పుడల్లా విమర్శలకు దిగుతున్నారు. ఇవన్నీ చూస్తే లోకేష్ పనితీరు మెరుగుపడిందని ఒప్పుకోవాల్సిందే.