లాలూ, జయలలిత, చంద్రబాబు… పదేళ్ల జైలు తప్పదా?

ప్రస్తుతం చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులు ఏపీలో రాజకీయంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత తరహా కేసులకు సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. ఫలితంగా… చంద్రబాబు చేసినట్లు చెబుతున్న అవినీతి నిరూపణ అయితే… పదేళ్ల జైలు శిక్ష తప్పదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రజాధనాన్ని కాజేసి పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇది చాలా సీరియస్ విషయమని.. ఫలితంగా ఆయన అరెస్టు ఖాయమని, ఈ కేసు నుంచి ఆయన బయటపడడం దాదాపూ అసాధ్యమని విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

ఈ విషయం తీవ్ర ఆర్థిక నేరమని చెబుతున్న విశ్లేషకులు… ఈ నేరానికి పాల్పడినట్లు నిరూపణ అయితే చట్ట ప్రకారం కనీసం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు అవినీతికి సంబంధించి ఐటీ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఇక టెక్నికల్ గా మాత్రమే నేరం రుజువు కావాల్సి ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో ఈ అభియోగాలు నిరూపణ అయితే రాజకీయంగా కూడా చంద్రబాబు కెరీర్ ఆల్ మోస్ట్ ఫినిష్ అని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా… ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఏదైనా పదవిని పొందేందుకు సైతం చంద్రబాబు అనర్హుడు అవుతారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ కేసులో ఈడీ, సీబీఐ ఎంట్రీ తప్పకపోవచ్చని అంటున్నారు.

ఇదే సమయంలో ఈ కేసులో లోకేష్ పాత్రపైనా పలు సందేహాలు వ్యక్త పరుస్తూ ఫ్యూచర్ చెబుతున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలో… ఐటీ అధికారులు తమ నోటీసులలో వెల్లడించిన ప్రకారం చూస్తే నారా లోకేశ్‌ కు ఈ వ్యవహారంలో కీలకపాత్ర ఉన్నట్లు అన్ని ఆధారాలుండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఫలితంగా.. లోకేష్ సైతం భవిష్యత్తులో ఈ కేసులో విచారణ ఎదుర్కోక తప్పకపోవచ్చని అంటున్నారు.

ఇదే క్రమంలో… గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్, జయలలితపైన నమోదైన కేసులు కూడా ఇదే కోవకు చెందినవని అంటున్నారు పరిశీలకులు. నాడు వారు కూడా అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టిన కేసులే అని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా చంద్రబాబు సైతం అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బులు సంపాదించారని ఐటీ అధికారుల నోటీసులలో స్పష్టంగా ఉందని చెబుతున్నారు.

దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. 118 కోట్ల రూపాయల వ్యవహారం అని తీగలాగడం మొదలుపెడితే మొత్తం డొంకంతా కదులుతుందని చెబుతున్నారు! మరి ఈ వ్యవహారం ఎక్కడికి వచ్చి ఆగుతుందనేది వేచి చూడాలి!