ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రాహులా గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీయేతర కూటమి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో చంద్రబాబుతోపాటు టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర, కంభంపాటి పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు కొప్పుల రాజు, అహ్మద్ పటేల్ హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ తో కలిసి నడవాలన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇరు పార్టీల అధినేతల మధ్య చర్చలు జరిగాయి.
మోడీ వ్యతిరేక పక్షాలన్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు బాబు. ఎన్డీయేకి వ్యతిరేకంగా ఉన్న సక్తుల్లానీటిని కూడగట్టేందుకు ఏవిధంగా కార్యాచరణ రూపొందించాలి అనే అంశాలపైన చర్చ నడిచినట్టు తెలుస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ తో కలిసి ముందుకు నడుస్తోన్న టీడీపీకి 14 సీట్లు కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. దీనికి అభ్యంతరాలు తెలుపలేదు టీడీపీ. ఇక ఏపీలో కూడా కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై ప్రధానంగా చర్చ నడిచినట్లు తెలుస్తోంది.
అంతేకాదు దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే సభలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నిటిని కూడగట్టుకుంటోంది. ఇదే తరుణంలో చంద్రబాబు కూడా కాంగ్రెస్ తో పొత్తుకు సంకేతాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నట్టు స్పష్టం అవుతోంది. సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశంపై ఏపీ భవన్ లో చంద్రబాబు మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.