వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నంలో కీలకమైన అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచేందుకు చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన కిడారి సర్వేశ్వరరావును టిడిపిలోకి లాక్కున్న విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు, మైనింగ్ లైసెన్సులు, మంత్రిపదవిని ఎరగా వేసి కిడారిని ప్రలోభపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. చివరకు ఆ ప్రలోభమే కిడారి ప్రాణాలను బలితీసుకున్నదన్న విషయం అర్ధమైయింది.
మావోయిస్టుల హత్యకు గురయ్యేముందు తనకు టిడిపి రూ 12 కోట్లు ఇచ్చిందని, మైనింగ్ లైసెన్సులిచ్చిందని స్వయంగా కిడారే మావోయిస్టులతో చెప్పినట్లు ప్రత్యక్ష సాక్ష్యుల ద్వారా బయటకు వచ్చింది. సరే ప్రస్తుత విషయానికి వస్తే షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఉన్నది ఎనిమిది మాసాలు మాత్రమే. కాబట్టి అరకులో ఉపఎన్నికలు రావు. అదే సమయంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ చేయాలని అనుకుంటున్నట్లు చంద్రబాబే చెప్పారు.
కాబట్టి చేయాలని అనుకుంటున్న మంత్రివర్గ విస్తరణలో కిడారి కొడుకు కిడారి శ్రవణ్ కుమార్ కు అవకాశం ఇచ్చే విషయాన్ని చంద్రబాబు సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మామూలుగా అయితే వచ్చే ఎన్నికల్లో కిడారి గెలిచే అవకాశాలు లేవు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు కాబట్టి కిడారిపై సానుభూతి పెరిగిపోయిందని చంద్రబాబు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రవణ్ కు టిక్కెట్టు ఇచ్చే బదులు ఇపుడే మంత్రిని చేసి గిరిజన ప్రాంతాల్లో బాగా తిప్పితే గిరిజనుల్లో మంచి పేరు తెచ్చుకోవచ్చన్నది చంద్రబాబు ప్లాన్ గా చెబుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత సానుభూతి కోసం కూతురు భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చినట్లు.
కిడారి మరణంతో వచ్చే సానుభూతి, శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చిన గుడ్ విల్ కలిసి వచ్చే ఎన్నికల్లో అరకులో టిడిపి జెండా ఎగరటం ఖాయమని చంద్రబాబు అంచనా వేస్తున్నారట. పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసిన గిరిజన అభ్యర్ధుల్లో ఒక్కరు కూడా ఎంఎల్ఏ, ఎంపిగా గెలవని సంగతి అందరికీ తెలిసిందే. ఎటూ అవకాశం వచ్చింది కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని గిరిజన ప్రాంతాల్లో పార్టీ జెండాను ఎగరేయాలన్నది చంద్రబాబు మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు.