(కోపల్లె ఫణికుమార్)
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హమని వెనకటి మహాకవి శ్రీశ్రీ అన్నారు. శ్రీశ్రీ చెప్పింది కవితలకైతే అదే పద్దతిని పబ్లిసిటికి అన్వయించుకుని చంద్రబాబునాయుడు ఫుల్లుగా అలా ముందుకెళిపోతుంటారు. తాజాగా బాబ్లి ప్రాజెక్టుపై ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నోటీసును కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చేసుకుని ప్రచారం పొందుతున్నారు. నిజానికి ఎవరికైనా కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసిందంటే సిగ్గు పడాల్సిన విషయమే. ఎందుకంటే, అరెస్టు వారెంటు వెనక కోర్టు కేసుకుహాజరుకాకుండా ఎగ్గొట్టారనే హిస్టరీ ఉంది. నేను మహానుభావుని, ఆంధ్రని అభివృద్ధి చేస్తున్నా, మహారాష్ట్ర కోర్టుకు రమ్మంటే ఎలా అనేది ఆయన వాదన. కోర్దు కేసుల వాయిదాను ఎగ్గొట్టడమంటే, అది చిన్న కోర్టే కావచ్చు, లా ని అగౌరవపర్చడమే కదా. అయినసరే ఆయన సిగ్గుపడడు. కోర్టు వారంట్ అంటే ఒక విధంగా శిక్ష పడటమే. దాన్ని కూడా ప్రచారానికి వాడేసుకుంటున్న మహాను భావుడు చంద్రబాబు నాయుడు.
ఇపుడు చంద్రబాబు వారంట్ ఇష్యునే తీసుకుందాం. మహారాష్ట్రలో నిర్మితమవుతున్న బాబ్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించటం కోసం 2010లో చంద్రబాబు అండ్ కో ప్రాజెక్టు సైట్ కు వెళ్ళారు. అయితే, ప్రాజెక్టు సైట్ లోకి ఎంటర్ అవ్వటానికి చంద్రబాబు, నేతలకు అనుమతి లేదుకాబట్టి వెనక్కు వెళ్ళిపోవాలని మహారాష్ట్ర పోలీసులు గట్టిగానే హెచ్చరించారు. కానీ అక్కడున్నది చంద్రబాబు కదా . అందుకనే తాను వెనక్కు వెళ్ళేది లేదన్నారు. దాంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దొరికిన వాళ్ళని దొరికినట్లు ఉతికొదిలిపెట్టారు. దాంతో పోలీసు దెబ్బలకు తట్టుకోలేక చాలా మంది నేతలు ఏపి బార్డర్లోకి పరిగెత్తుకుని వచ్చేశారు.
తప్పించుకోంగా మిగిలిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లలో తిప్పి తర్వాత కోర్టులో హాజరుపరిచారు. మామూలుగా ఇటువంటి ఆందోళనల్లో దొరికన వాళ్ళను పోలీసు స్టేషన్లోనే ఏదో కాస్త ఫైన్ వేసి బెయిలిచ్చేసి పంపిచ్చేస్తారు. అదే పద్దతిలో చంద్రబాబు అండ్ కోను వెళ్ళిపొమ్మంటే వెళ్లనంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో వాళ్ళందరినీ కోర్టులో ప్రవేశపెట్టి బెయిల్ పై వదిలిపెట్టారు. అప్పట్లో ఆ ఇష్యూని చంద్రబాబు జాతీయ స్ధాయిలో ప్రచారానికి బాగా వాడుకున్న విషయం అందరికీ తెలిసిందే.
సరే, ఇదంతా ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం జరిగింది. తర్వాత పోలీసులు, కోర్టులు కూడా మరచిపోయాయట. మరి అందరూ మరచిపోయిన ఇష్యు ఇప్పుడే హటాత్తుగా ఎందుకు బయటకు వచ్చింది ? అదే ఇపుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఇక్కడ విషయం ఏమిటంటే, తెలంగాణాలో ముందస్తు ఎన్నికల వేడి పెరిగిపోతోంది. కాంగ్రెస్-టిడిపిల మధ్య పొత్తులు కూడా కుదిరాయి. ఇంతటి చారిత్రక ఘట్టంలో చంద్రబాబు పాత్ర మాత్రం తెరవెనుకకే పరిమితమైపోయింది. పొత్తులు సరే, రేపటి రోజున ఎన్నికలకైనా వస్తారా అంటే అదీ లేదట. ఎందుకంటే, కెసిఆర్ ప్రధాన కారణమని సమాచారం.
అదేనండి ఓటుకునోటు కేసు గుర్తుందా ? ఆ కేసులో జాతీయస్ధాయిలో అప్పట్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఎంతగా గబ్బు పట్టిపోయారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ కేసులో అప్పట్లో అరెస్టు ఒకటే తక్కువ. తెరవెనుక జరిగిన ఒప్పంద వల్ల పదేళ్ళ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని కూడా వదిలేసి అర్ధాంతరంగా చంద్రబాబు విజయవాడకు పారిపోయారు. అప్పటి నుండి కెసిఆర్ కు వ్యతిరేకంగా నోరెత్తితే ఎక్కడ కేసు విచారణ మొదలవుతుందో, ఎప్పుడు అరెస్టంటారో తెలీక భయపడుతున్నారు చంద్రబాబు. ఇపుడు తెలంగాణాలో ప్రచారమంటే కెసిఆర్ కు వ్యతిరేకంగానే కదా చేయాలి ? కెసిఆర్ కు వ్యతిరేకంగా ప్రచారమంటే ఇంకేమన్నా ఉందా ?
ఇక్కడే చంద్రబాబు బుర్ర పాదరసం లాగ పనిచేసింది. కెసిఆర్ కు వ్యతిరేకంగా నోరెత్తకూడదు. అలాగని టిడిపికి ఫుల్లుగా మైలేజ్ రావాలి ఎలా ? ఎలాగంటే, బాబ్లి ప్రాజెక్టు పూర్తయితే నష్టపోయేది ఉత్తర తెలంగాణానే. కాబట్టి అదే విషయాన్ని ఇపుడు ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇంకేముంది వెంటనే అప్పటి బాబ్లి ప్రాజెక్టు ఎపిసోడ్ ను బయటకు తీశారు. అప్పట్లో బాబ్లి ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణా ఎడారిలా మారకూడదనే తాను పోరాటం చేశానంటూ చంద్రబాబుతన భుజం తాను తట్టుకోవటం మొదలుపెట్టారు. చంద్రబాబు ఏమి చెప్పినా చెప్పకపోయినా బ్రహ్మాడమంటూ అచ్చోసొదిలే మీడియా ఎలాగూ చేతిలో ఉంది. ఇపుడదే జరుగుతోంది. తెలంగాణా కోసం చంద్రబాబు ఎంతో పోరాటాలు చేశాడంటూ టిడిపికి మద్దతిచ్చే మీడియా డప్పు కొడుతోంది. తెలంగాణాకు చంద్రబాబుకు టిడిపికి ముడేసి టిడిపికి అనుకూలంగా మీడియా ఊదరగొడుతోంది. అప్పటి చంద్రబాబు బాబ్లి ప్రాజెక్టు సందర్శన ఫొటోలను దొరికితే వీడియోలను కూడా ఇపుడు ఎన్నికల సమయంలో ఉపయోగించుకుంటోంది. చంద్రబాబుకు కూడా కావాల్సిందిదే. చూడండి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును కూడా తెలివిగా చంద్రబాబు తనకు అనుకూలంగా ఎలా ప్రచారానికి వాడుకుంటున్నారో ? చంద్రబాబా మజాకానా ?