చంద్రబాబు ప్రేమ లేఖ: ఉందా.. చిరిగి చెత్తబుట్టకు చేరిందా?

ఏపీలో ఈసారి రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలకూ అత్యంత కీలకం అనేది తెలిసిన విషయమే. ఈ విషయంలో వైసీపీ, జనసేనలకంటే ముఖ్యంగా టీడీపీకి ఈ దఫా ఎన్నికలు అత్యంత కీలకం. ఈసారి అటో ఇటో అయితే తెలుగుదేశం మనుగడ ప్రశ్నార్ధకం అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో చంద్రబాబు తన గెలుపుకు కలిసొచ్చే ఏ చిన్న విషయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. నిండా మునిగినోడికి చలేమిటి అన్న చందంగా ఎందాకైనా తగ్గడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగా… 40ఏళ్ల అనుభవం, 8సార్లు ఎమ్మెల్యే, 3సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు… ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అవ్వని పవన్ కల్యాణ్ కు ప్రేమ లేఖ రాశారు.

ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. “మనం ప్రేమ లేఖ రాశాం.. రిప్లై కోసం చూస్తున్నాం.. జనసేనపై టీడీపీది వన్ సైడ్ లవ్” అని మాగ్జిమం తగ్గి మాట్లాడారు. ఈ ప్రేమలేఖకు జనసేన నుంచి ప్రత్యక్షంగా రిప్లై ఇచ్చినట్లు కనిపించ లేదు కానీ… చీకట్లో మాత్రం కలుసుకోవడం స్టార్ట్ చేశారు పవన్ కల్యాణ్ అనే కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి.

ఈ విషయాలపై స్పందించే పవన్… కలిసిపోటీ చేయడం అనివార్యం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటారే తప్ప… పొత్తు కన్ ఫాం అయ్యిందని మాత్రం బహిరంగంగా ప్రకటించరు. ఫలితంగా రెండు పార్టీల కేడర్ ను కన్ ఫ్యూజన్ లో పాడేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన పరిణామాలు వీరి రహస్య ప్రేమ విఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.

తాజాగా బీజేపీ నేతృత్వంలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశానికి పవన్ హాజరవ్వడం.. మీటింగ్ కి ముందు మూడు పార్టీలూ కలిసి పోటీ చేయాలనే కోరికను బయటపెట్టినప్పటికీ… ఢిల్లీ నుంచి మంగళగిరి వచ్చేపాటి స్వరం మార్చారు. రాబోయే రోజుల్లో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని తనదైన శైలిలో చెప్పారు. అదే తన లక్ష్యం అని నొక్కి వక్కానించారు.

అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా చంద్రబాబు రాసిన ప్రేమ లేఖ చిరిగిపోయినట్లే, చెత్త బుట్టకు చేరినట్లే అని కొందమంది వ్యాఖ్యానిస్తుండగా… ఎన్నికల సమయానికి పవన్ కల్యాణ్ మళ్లీ ఆ ప్రేమ లేఖను పాత టంకు పెట్టెలోనుంచి బయటకు తీస్తారని, మరోసారి చదువుతారని, ఆ క్షణం మనసు మారే సూచనలు ఉండొచ్చని అంటున్నారు.

మరి ఎన్నికలకు ఇంకా సుమారు ఎనిమిది నెలల సమయం ఉందని అంటున్న తరుణంలో… అసలు ఆ ప్రేమ లేఖ ఇంకా పవన్ కల్యాణ్ వద్ద ఉందా.. లేక, ఆయన చింపేసి చెత్తబుట్టలో పాడేశారా అనేది వేచి చూడాలి. అయితే ఎవరైనా చూస్తారని పవన్ ఆ ప్రేమ లేఖను చింపేసినా… లోపల బాబుపై ప్రేమ మాత్రం తగ్గదని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ ప్రేమకథ సక్సెస్ అవుతుందా.. లేక, విషాదాంతం అవుతుందా అనేది వేచి చూడాలి.