చంద్రబాబు తప్పుకోవాల్సిందేనా.? తప్పదా.?

ప్రత్యక్ష రాజకీయాల నుంచి చంద్రబాబు గౌరవ ప్రదంగా తప్పుకుంటేనే మంచిదేమో.! ఈ మాట టీడీపీ శ్రేణుల్లోంచే వినిపిస్తోంది. ‘కొందరు సీనియర్లను నిర్మొహమాటంగా చంద్రరబాబు పక్కన పెట్టాలి. కానీ, ఆయన అలా చేయలేరు. అందుకే, నారా లోకేష్‌కి పూర్తి బాధ్యతలు అప్పగించాలి. అప్పుడే టీడీపీలో కొత్త జోరు షురూ అవుతుంది..’ అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.

ఇంకో వైపు, టీడీపీ మిత్రపక్షం వాదన మరోలా వుంది. 2024 ఎన్నికల వరకు, ముఖ్యమంత్రి పదవికి సంబంధించి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదిస్తే, కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కుతుందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సహా అనేక కేసులు చంద్రబాబు మీద వైసీపీ హయాంలో మోపబడిన విషయం విదితమే. ఆయా కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పొందడం, కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్ పొందడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మిస్టర్ క్లీన్ ఇమేజ్ వున్న పవన్ కళ్యాణ్‌ని సీఎం అభ్యర్థిగా నిలబెట్టడమే కూటమికి మేలు.. అన్నది మెజార్టీ అభిప్రాయం.

ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక కూటమి తరఫున సీఎం అభ్యర్థి అయితే, బీజేపీ కూడా బేషరతుగా కూటమికి మద్దతిస్తుందని జనసేన నేతలు భావిస్తున్నారు. కానీ, చంద్రబాబు అంత తేలిగ్గా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.

కానీ, టీడీపీ శ్రేణులు చంద్రబాబుని పక్కకు తప్పుకుని లోకేష్‌ని ముందుకు పెట్టాలని కోరుతుండడం, జనసేన శ్రేణుల్లో పవన్ కళ్యాణ్‌నే ముందు పెట్టాలనే డిమాండ్.. వెరసి, చివరి నిమిషంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

టీడీపీ ఓడితే, రాజకీయంగా తన భవిష్యత్తు ఏంటన్నది చంద్రబాబుకి బాగా తెలుసు. సో, రిస్క్ తీసుకుంటారా.? వేచి చూడాల్సిందే.