కుప్పం విషయంలో బాబు కీలక నిర్ణయం!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం.. ఆ పార్టీ కంచు కోటగా భావిస్తారు. సుదీర్ఘ కాలంగా అక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబుకు… గత ఎన్నికల్లో మెజార్టీ తగ్గింది. దీనికితోడు అధికార వైసీపీ ఆ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో… స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కుప్పంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో… ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమున్న నేపథ్యంలో… చంద్రబాబు కుప్పం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

వైనాట్ 175 అంటున్న వైసీపీ నాయకుల మాటల విషయంలో మరింత జాగ్రత్త పడుతున్న చంద్రబాబు… కుప్పంపై కాన్సంట్రేషన్ పెంచారు. గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే తన కంచుకోటపై కాన్సంట్రేషన్ చేసే బాబు… ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉండగానే తన నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈసారి కుప్పంలో చంద్రబాబుని గెలవనివ్వమంటూ.. మంత్రి పెద్ది రెడ్డి స్టేట్ మెంట్స్ కూడా ఇస్తున్న పరిస్థితి! దీంతో… రిస్క్ తీసుకోవద్దని భావించిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పెద్ద టీం ని ఏర్పాటు చేశారు. దానికి ఒక ఇన్ ఛార్జ్ ని నియమించారు.

అవును… కుప్పం టీడీపీ వ్యవహారాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించిన కంచర్ల శ్రీకాంత్ ను.. కుప్పం నియోజకవర్గ ఎన్నికల కమిటీకి చైర్మన్‌ గా చంద్రబాబు నియమించారు. ఈ కమిటీలో శ్రీకాంత్ తో పాటు 38 మంది పార్టీ సభ్యులు కూడా ఉంటారు. వీరంతా కలిసి ఈ ఏడాదంతా కుప్పంపై శ్రద్ధ పెట్టి పనిచేయాలి.. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో బాబు గెలుపు బాధ్యత తీసుకోవాలి!

ఇదే క్రమంలో… ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో… టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన సొంత నియోజకవర్గంలో ఎక్కువసార్లే పర్యటిస్తున్నారని తెలుస్తుంది. కుప్పంపై గతంలో కంటే ఇప్పుడు మరింత ఫోకస్‌ పెట్టి బాబు & కో పనిచేస్తున్నారట. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ కు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా… కుప్పంపై బాబు ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడం గొప్పవిషయమే అని కామెంట్లు పెడుతున్నారు టీడీపీ శ్రేణులు!