స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు పాతిక రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఇందులో భాగంగా మరో ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించింది.
అవును… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు ప్రకటించింది. దీంతో ఆయన ఈనెల 19 వరకూ రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు.
అయితే.. స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు రెండోసారి విధించిన రిమాండ్ గడువు నేటితో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్ గా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇదే సమయంలో జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది.
దీంతో… సీఐడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం… జ్యుడిషియల్ రిమాండ్ ను రెండు వారాల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆ సంగతి అలా ఉంటే మరోవైపు ఇదే కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ రెండు పిటిషన్లపైనా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు.
ఇందులో భాగంగా… స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు పాత్రను నిర్ధారించేలా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టుకు తెలిపారు. అలాగే ఈ స్కాంకు కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబే అని తెలిపారు. ఇదే సమయంలో ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాల్ని ఆయన ఇవాళ కోర్టుకు సమర్పించారని తెలుస్తుంది.
ఈ సమయంలో చంరబాబుని సీఐడీ కస్టడీకి ఇస్తేనే మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయని పొన్నవోలు తన వాదనలు వినిపించారు. దీంతో… చంద్రబాబును రాజకీయ కక్షతోనే జైల్లో ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తరుపు లాయర్ ప్రమోద్ దూబే వాదించారు. స్కిల్ కేసుతో చంద్రబాబుకు సంబంధమే లేదని, చంద్రబాబు కేవలం సీఎంగా మాత్రమే సంతకాలు చేశారని చెప్పుకొచ్చారు.
ఇలా సాగిన ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు… బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదే సమయంలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ లకు సంబంధించిన పీటీ వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.