చంద్రబాబుకు ప్రాణహాని ఉంది… జైలులో ఏమైనా చేస్తారేమో?

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును శనివారం ఉదయం అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. ఆపై పలు అభియోగాలను మోపారు. అరెస్టు అనంతరం బెయిల్ పిటిషన్ పై ధర్మాసనం విచారించింది.

ఈ సమయంలో చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరుపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సమయంలో సుమారు ఆరున్నర గంటల పాటు సాగిన వాదోపవాదాలను విన్న ధర్మాసనం.. చంద్రబాబుకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది.

దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ స్నేహ బ్లాక్ లో ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. ఖైదీ నెంబర్ 7691ను చంద్రబాబుకు కేటాయించారు జైలు అధికారులు. అయితే… చంద్రబాబు, సీఐడీ వేసిన పిటీషన్లపై ఏసీబీ కోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. రిమాండ్‌ కాకుండా హౌస్‌ అరెస్ట్‌ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు.

ఇదే క్రమంలో చంద్రబాబును 4 రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ పైనా విచారణ జరగనుంది. ఈ సమయంలో నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. జైల్లో ఉంచడం సరికాదని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో విశాఖ పోర్టు గెస్ట్‌ హౌస్‌ లో అచ్చెన్న నేతృత్వంలో టీడీపీ నేతలు గవర్నర్‌ ను కలిశారు. ఇందులో భాగంగా… చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ అనంతరం జరిగిన పరిణామాలను వివరిస్తూ, ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారనే అనుమానం ఉందని చెప్పుకొచ్చారు.