బిగ్ న్యూస్: మొదలైన విచారణ… కోర్టు ఆదేశాలివే!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబును సీఐడీ తమ కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్ ని ఏసీబీ కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజులు పాటు విచారించనున్నారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబు, సీఐడీ అధికారుల ముందు హాజరయ్యారు! విచారణ ప్రారంభమైంది!

శనివారం ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయం నుండి బయల్దేరిన సీఐడీ అధికారులు, రాజమండ్రి చేరుకున్నారు. ప్రస్తుతం సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ప్రారంభమైందని తెలుస్తుంది. ఈ విచారణలో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఒక ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ తో పాటు ఒక వీడియోగ్రాఫర్‌, ఇద్దరు మధ్యవర్తులుగా గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారని తెలుస్తుంది.

కోర్టు ఇచ్చిన రెండు రోజులు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటలవరకూ బాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఈ విచారణలో బాబుతో పాటు ఆయన తరుపు న్యాయవాదులు కనిపించేటంత దూరంలో ఉంటారు. విచారణ సమయలో ప్రతీ గంటకూ ఐదు నిమిషాల బ్రేక్ తో పాటు మధ్యాహ్నం 1 – 2 గంటల వరకూ లంచ్ విరామం ఉంటుంది.

ఇదే సమయంలో విచారణలో బాబు “తెలియదు, గుర్తులేదు, మరిచిపోయాను” అంటూ పూర్తిగా దాటవేత దోరణి అవలంభిస్తే.. విచారణకు సహకరించలేదనే కారణంతో… కస్టడీ పొడిగింపుకు సీఐడీ అధికారులు కోర్టును అనుమతికోరే అవకాశం ఉందని తెలుస్తుంది.

కాగ… చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇచ్చే సమయంలో కోర్టు, అధికారులకు మరికొన్ని ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా… చంద్రబాబుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకూడదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. కస్టడీకి తీసుకునే ముందు, ముగిసిన తర్వాత తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

అదేవిధంగా… విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌ తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియోని బయటకు విడుదల చేయకూడదని, మొత్తాన్ని సీల్డ్‌ కవర్‌ లో న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొంది. కస్టడీ గడువు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది.

విచారణలో పాల్గొన్న సీఐడీ టీం ఇదే:

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారించేందుకు 12 మందితో కూడిన సీఐడీ టీంలో ముగ్గురు సీఐడీ డీఎస్పీలు (ఎం.ధనుంజయుడు, వి విజయ్‌ భాస్కర్‌, ఎ లక్ష్మీనారాయణ) నలుగురు ఇనిస్పెక్టర్లు (ఎన్‌.ఎల్‌.వి. మోహన్‌ కుమార్‌, వై రవికుమార్‌, ఐ శ్రీనివాసన్‌, సీహెచ్‌. సాంబశివరావు) ఏఎస్సై పి.రంగనాయకులు, కానిస్టేబుల్‌ ఎం సత్యనారాయణ సీఐడీ తరుపున విచారణలో పాల్గొన్నారని సమాచారం.