గతకొంతకాలంగా టీడీపీలో సత్తెనపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దానికి కారణం… కీలకమైన ఈ నియోజకవర్గం నుంచి టీడీపీలో సుమారు నలుగురైదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటమే! అయితే తాజా గుంటూరు పర్యటనలో కూడా చంద్రబాబు ఈ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నియోజకవర్గంలో కేడర్ వర్గాలుగా విడిపోయారు! దీంతో ఇంకా నాన్చితే కరెక్ట్ కాదని భావించారో ఏమో కానీ… బాబు కీలక నిర్ణయం తీసేసుకున్నారు!
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ కండువా కప్పుకున్నప్పటినుంచీ తనకు కేటాయించబోయే సీటుపై ఆయనతోపాటు ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఒకానొకసమయంలో… త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే విషయంలో అంతులేని ఆలస్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ బాబుపై కాస్త గుస్సా అయ్యరు కూడా. అయితే తాజాగా చంద్రబాబు ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నారు. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ గా మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణను నియమించారు.
అయితే… 2019 వరకూ ఈ సీటులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన మరణానంతరం తనయుడు కోడెల శివరాం వారసుడిగా సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నారు. తాజాగా పల్నాడు పర్యటనలో భాగంగా దివంగత కోడెల శివప్రసాద్ పార్టీకి చేసిన సేవలపై చంద్రబాబు కొనియాడారు. కోడెల సేవలు మరిచిపోలేనివని, ఆయన సింహం లాంటి మనిషని పొగిడేశారు. కోటప్పకొండ అంటే కోడెల శివప్రసాదరావు గుర్తు వస్తారని తెలిపిన చంద్రబాబు… ఆ స్థాయిలో ఆయన ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకుని, అభివృద్ధి చేశారని కొనియాడారు.
అనంతరం… బ్రతికినంతకాలం పల్నాటి పులిగా ఉన్న కోడెల.. జీవితంలో ఎవరికీ భయపడలేదని.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం.. ఆయన ఆత్మహత్య చేసుకునేలా ప్రభుత్వం చేసిందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. తన కుటుంబంపై చంద్రబాబుకున్న అభిమానం తగ్గలేదని, నమ్ముకున్నవారికి టీడీపీ ఎప్పుడూ అన్యాయం చేయదని కోడెల శివరాం బలంగా నమ్మారు. అయితే తాజాగా బాబు… కోడెల కుటుంబానికి హ్యాండ్ ఇచ్చారు!
కాగా… సత్తెనపల్లి నియోజకవర్గం పెద్దమక్కెనలో కోడెల శివరాం స్వయంగా కోడెల శివప్రసాద్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి స్థానిక నేతలతో పాటు నారా రోహిత్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మైకందుకున్న శివరాం… “వచ్చే ఎన్నికల్లో నేనే టీడీపీ అభ్యర్థిగా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నాను.. నా తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి స్థానంలో ఉండి నడిపిస్తానని చంద్రబాబు నాకు నాడు హామీ ఇచ్చారు.. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో నేను పోటీ చేస్తున్నాను. సత్తెనపల్లి టీడీపీ కార్యకర్తలకు ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దు” అని ప్రకటించారు!
మరి తాజా పరిణామాలతో కోడెల శివరాం.. కోడెల వర్గీయులు ఎలా రియాక్ట్ అవుతారు.. కన్నాకు ఏమేరకు సహకరిస్తారనేది వేచి చూడాలి!