ఆంధ్రా ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్

పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలంటూ దేశవ్యాప్తంగా బంద్ జరుగుతున్న వేళ ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు తీపికబురు అందించారు. పెట్రోల్, డీజిల్ రేట్లపై రూ. 2 రూపాయలను వ్యాట్ తగ్గిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం కూడా ధరలు తగ్గించాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. వ్యాట్ తగ్గింపుతో ఏపీ ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం రూ.1120 కోట్ల భారం పడనుంది. తగ్గిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయి. చంద్రబాబు ప్రకటనతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ పరిస్థితుల వల్లే పెట్రోల్ ధర పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. 2013-14 లో ముడి చమురు ధర బ్యారెల్ కు రూ.105.52 డాలర్లు,2015-16లో క్రూడాయిల్ ధర కేవలం 46 డాలర్లకు పడిపోయినప్పుడు కూడా దేశంలో ఇంధనం ధర తగ్గలేదని చంద్రబాబు గుర్తు చేశారు.

ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర రూ.76 డాలర్లుగా ఉందని, 2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.49.60 ఉండగా ప్రస్తుతం  రూ.86.70 గా ఉందని తెలిపారు. పెట్రోల్ డీజిల్ పై కేంద్రం, చమురు సంస్థలు రోజురోజుకూ ధరలు పెంచుతున్నాయని ఆయన మండి పడ్డారు. ఇంధన ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.