అమెరికాలో పర్యటలో ఉన్న చంద్రబాబునాయుడుకు చేదుఅనుభవం ఎదురైంది. వేదిక మీద నుండి మాట్లాడటానికి రెడీ అవ్వగానే ఒక్కసారిగా ఎన్ఆర్ఐలు నిరసన తెలపటంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. ఎంతసేపటికి నిరసన ఆపకపోయేటప్పటికి ఏం చేయాలో అర్ధంకాలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే, అమెరికా పర్యటనలో పలు ప్రాంతాల్లో చంద్రబాబు ఎన్ఆర్ఐలతో సమావేశమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక విధంగా ఎన్ఆర్ఐలతో తన భేటీని చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు.
అందులో భాగంగానే న్యూజెర్సీలో కూడా ఓ సమావేశం ఏర్పాటైంది. సమావేశంలో చంద్రబాబుతో పాటు నిర్వాహకుల్లో పలువురు వేదిక మీద కూర్చున్నారు. సమావేశంలో మాట్లాడేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. దాంతో ఒక్కసారిగా సమావేశంలో గోల మొదలైంది. చంద్రబాబు మాట్లాడేందుకు వీల్లేదంటూ ఒకటే అరుపులు, కేకలు వినిపించాయి. సభలోని వారు ఎందుకు కేకలు పెడుతున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. అరుస్తున్న వారిని సముదాయించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా వారెవరూ వినలేదు.
దాంతో నిర్వాహకుల్లో కొందరు వేదిక మీద నుండి క్రిందకు వచ్చి కేకలు పెడుతున్నవారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఇంతకీ వారి గోలేమిటంటే ? ఆమధ్య షికాగోలో బయటపడిన సినీతారల సెక్స్ రాకెట్ వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ కేసులో పలువురు తెలుగు వాళ్ళని షికాగో పోలీసులు అరెస్టు చేయటం, ఇంకొంతమందిని అదుపులో తీసుకుని పలుమార్లు విచారించటం కూడా గుర్తుండే ఉంటుంది. ఆ కేసులో ఆరోపణలను, విచారణను ఎదర్కొంటున్న వారిలో పలువురు చంద్రబాబుతో వేదిక మీద కూర్చున్నారు. కేసుల్లో ఇరుక్కున్న వారే చంద్రబాబుతో వేదిక మీద కూర్చోవటాన్ని సహించలేక నిరసన తెలిపారు. సభలోని వారి మూడ్ గ్రహించిన చంద్రబాబు చివరకు ఏమీ మాట్లాడకుండానే సమావేశం ముగించేసి వెళ్ళిపోయారు.