నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో అలంకరించకపోవడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మొదట తెల్లవారు జామున 5.30గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. అయితే అక్కడికి రాగానే పరిస్థితిని చూసి అసహనం వ్యక్తం చేశారు.
సమాధి దగ్గర ఒక్క పువ్వు కూడా కనిపించలేదు. అక్కడ చెత్త చెదారంతో ఉండడంతో అసహనానికి గురయ్యారు. వెంటనే అనుచరులను పిలిపించి పువ్వులను తెప్పించారు. అనంతరం కొన్ని నిమిషాల వరకు మౌనంగా అక్కడే కూర్చున్న తారక్ ఇక నుంచి తాత వర్థంతి – జయంతి వేడుకలకు సంబందించిన ఏర్పాట్లను తానే చూసుకుంటాను అని చెప్పారు.
ఇక ఈ విషయమై తెలుగుదేశం పార్టీ పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాట్లు చేసిందని చెప్పిన చంద్రబాబు, ఈ సంవత్సరం కూడా తాము లేఖను ఇచ్చామని, సర్కారే అలంకరణ చేస్తుందని భావించామని అన్నారు.
ఘాట్ వద్ద అలంకరణ చేయలేదనే వార్తలు తాను మీడియాలోనే చూశానని చెప్పారు. మరోసారి ఇది పునరావృతం కాకూడదని అన్నారు. ప్రభుత్వం చేయకపోతే పార్టీ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అలంకరణ చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో సమాచార లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు.