రిపీట్టే…: ఆఖర్లో హ్యాడ్ ఇవ్వనున్న బాబు!

తమ్ముళ్లు ఏదో కలలు కంటున్నారు కానీ… చంద్రబాబు ఏమీ మారలేదు. నడకమారిందే.. నా నవ్వు మారిందే.. నా థాట్ మారిందే.. నా టార్గెట్ మారిందే.. అని పైకి చెబుతున్నా… చేతల్లోకి వచ్చేసరికి పాతబాబునే గుర్తుచేస్తున్నారు చంద్రబాబు. దీంతో పెదవి విరిస్తూ… ఈ సారి కూడా సెం టు సేం అంటూ నిట్టూరుస్తున్నారు! దీనికి కారణమైంది.. చంద్రబాబు గుంటూరు జిల్లా టూర్!

జగన్ కు ముందస్తుకు రానిపక్షంలో… ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న పోటీ రీత్యా… ఇదేమీ పెద్ద ఎక్కువ సమయం కాదు. ఇప్పుడు మొదలుపెడితే అప్పటికి ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి. ఈ సమయంలో చంద్రబాబు జిల్లా యాత్రలు స్టార్ట్ చేసే సరికి.. “అభ్యర్థులను ప్రకటించేస్తారు.. ఇక ప్రచారాలు మొదలెట్టేసుకుందామని” నేతలు భావించారు. కానీ… ఊహకు అందితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు?

టీడీపీ నేతలు, తమ్ముళ్లూ ఎంతో ఆశగా, అసక్తిగా ఎదురుచూసిన సత్తెనపల్లి నియోజకవర్గం విషయంలో… అక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును చంద్రబాబు ప్రకటించలేదు. ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ లోకేష్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సత్తెనపల్లిలో పర్యటించిన చంద్రబాబు.. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థి పేరును మాత్రం ప్రకటించకుండా… కేడర్ లో కన్ ఫ్యూజన్ ని అలానే ఉంచారు. ఫలితంగా వర్గపోరులు కంటిన్యూ అయ్యే అవకాశమిచ్చారు!

అవును… ఏపీలో టీడీపీ నుంచి భారీ పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. సత్తెనపల్లి సీటును ఏకంగా ఐదుగురు అభ్యర్థులు ఆశిస్తున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తనయుడు కోడెల శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు, తెలుగు యువత నేత అబ్బూరు మల్లి, ఇటీవలే బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ… సత్తెనపల్లి సీటు కోసం పావులు కదుపుతున్నారు.

సత్తెనపల్లి సీటుపై ఆశపెట్టుకున్న వీరంతా ఎవరి పనులు వారు… వర్గాలుగా విడిపోయి చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన బాబు సభకు కూడా… ఎవరి స్థాయిలో వారు జనసమీకరణ చేశారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి సీటును చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే… ఇప్పుడే అభ్యర్థిని ప్రకటిస్తే మిగతా వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉందని చంద్రబాబు భావిస్తుండగా… ఇప్పుడే ప్రకటించేస్తే… మిగిలిన వారిని బుజ్జగించుకుని లైన్ లో పెట్టుకునే టైం ఉంటుందని నేతలు చెబుతున్నారంట. అలాకానిపక్షంలో… ఎన్నికలు సమీపించనప్పుడు చెబితే… ఆశలు పెరిగిపోయిన నేతల వ్యతిరేకత పీక్స్ కి చేరిపోతుందని.. అప్పుడు బుజ్జగించడానికి కూడా సమయం ఉండదని వాపోతున్నారంట.

దీంతో… చంద్రబాబు మారలేదని, ఇంకా ముతక రాజకీయాలే చేయాలని భావిస్తున్నారని, ఏదైనా ట్రాన్స్ పరెంట్ గా ఉండి ఇప్పుడే క్లారిటీ ఇచ్చేస్తే.. అది అభ్యర్థికీ, పార్టీకి కూడా మేలు చేసినట్లవుతుందని వాపోతున్నారంట తమ్ముళ్లు!