సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పర్యటన అంటూ మొదలుపెట్టిన చంద్రబాబు… పర్యటించిన ప్రతీ చోటా అల్లర్లకూ, ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రత్య్యత్నించారంటూ ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలకంటే ఎక్కువగా స్థానికులు, పోలీసులూ.. చంరబాబు వైఖరిని దుయ్యబట్టారు.
ఈ సమయంలో పుంగనూరు, అంగళ్లు హింసాత్మక ఘటన కేసులు మరో మలుపు తిరగాయి. వీటికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 4న చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పర్యటన సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా… అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద, చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లపై పోలీసులుకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబుతోపాటు పలువురు టీడీపీ లీడర్లను నిందితుల జాబితాలో చేర్చారు. ఇందులో ఏ1 గా చంద్రబాబును చేర్చిన పోలీసులు.. ఆయనతోపాటు ఏ2గా దేవినేని ఉమామహేశ్వరరావు, ఏ3గా అమర్నాథ్ రెడ్డిని చేర్చారు.
వారితో పాటు స్థానిక టీడీపీ నేతలు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు. ఇదే సమయంలో ఇతరులు అంటూ మరికొందరు టీడీపీ నేతలపైనా కేసు నమోదు చేశారని తెలుస్తోంది. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్ లో ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలు వంటి వాటితో ప్రయాణిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఉమాపతిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు 307 సెక్షన్ కింద హత్యాయత్నం, 120బీ సెక్షన్ కింద నేరపూరిత కుట్ర చేసినట్టు అందులో పేర్కొన్నారు.
ఇదే సమయంలో అంగళ్లు, పుంగనూరు అల్లర్లకు సంబంధించి మొత్తం 245 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. వారిలో సుమారు 74 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటి వరకూ ఏడు చార్జ్ షీట్ లు నమోదు చేయగా.. ఇందులో ప్రధాన నిందితుడిగా చల్లాబాబు అలియాస్ రామచంద్రారెడ్డిని చేర్చారు.