బాబు తగ్గేదేలే… జనసేనకు మూడో షాకిచ్చిన టీడీపీ!

రిపబ్లిక్ డే రోజున పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంతో ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు బీటలు వారుతుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. మరోపక్క పవన్ కు పౌరుషం ఎక్కువ.. పొత్తు ధర్మం పాటించకపోతే ఆయన సహించరు అని ఒకరంటే… ఇదంతా టీడీపీ – జనసేన కలిసి కాపులను ఏమార్చే నాటకం అని ఇంకొకరు అన్నారు. కట్ చేస్తే… ఇప్పుడు చంద్రబాబు మరోసీటు ప్రకటించారు.

“రా.. కదలిరా” కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే.. మండపేట, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. ఈ విషయంపై ఇటీవల స్పందించిన పవన్… తనకు కూడా ఒత్తిడి ఉందని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తాను కూడా ప్రకటిస్తున్నాను అంటూ రాజోలు, రాజానగరం నియోజకవర్గాలను ప్రకటించారు. దీంతో భారీ చర్చే నడిచింది. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు మూడోసీటు ప్రకటించారు.

పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించారని.. ఇది పొత్తు ధర్మం కాదని.. ఈ ప్రకటనతో ఆందోళన చెందిన జనసేన నేతలకు, కార్యకర్తలకు తన క్షమాపణలు అని… రిపబ్లిక్ డే రోజున చేసిన ప్రసంగంలో పవన్ తెలిపారు. అనంతరం రాజోలు, రాజానగరం స్థానాలను ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా… “చర్యకు ప్రతిచర్య ఉంటుంది” అంటూనాగబాబు ట్వీట్లు చేశారు.. జోగయ్య లేఖలు రాశారు.

దీంతో… వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతున్నట్లుందనే చర్చ నడిచింది. ఇదే సమయంలో ఈ విషయంపై స్పందించిన పేర్ని నాని… ఇదంతా చంద్రబాబు – పవన్ ఆడుతున్న డ్రామా అని.. ఆ రెండు సీట్లకూ చంద్రబాబు ఇప్పటివరకూ ఇన్ ఛార్జ్ లను ప్రకటించలేదని.. అవి బాబు విదిలించిన సీట్లే తప్ప, పవన్ సాధించుకున్న సీట్లు కాదని.. జనసైనికులను మోసం చేయడానికి పవన్ ఆడుతున్న డ్రామా ఇది అని తేల్చి చెప్పారు!!

ఈ క్రమంలో చంద్రబాబు తాజాగా మరో నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించేశారు. నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని బాబు ఖారారు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొలుసు పార్థసారథికి నూజివీడు టికెట్ ఖారారు చేస్తూ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో… ఫిబ్రవరి 1వ తేదీన బాబు సమక్షంలో పార్థసారథి పసుపు కండువా కప్పుకోనున్నారని సమాచారం.

ఆ సంగతి అలా ఉంటే… ఇది పవన్ కు చంద్రబాబు ఇచ్చిన మూడో షాక్ అని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తులో ఏకపక్షంగా టిక్కెట్ల ప్రకటన రచ్చ సాగుతున్న తరుణంలో.. చంద్రబాబు మూడో టిక్కెట్ గా నూజివీడు ను వైసీపీ నుంచి పార్టీలోకి రాబోతున్న నేతకు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.