ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని అందుకున్న కూటమి ప్రభుత్వం ఏపీ పాలనకు అడుగుపెట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా… జూన్ 12ను రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇదో సాధారణ వార్షికోత్సవం కాదు… జనం భాగస్వామ్యంతో, అభివృద్ధి ఆశయాలతో జరపబోయే జనోత్సవం లాంటి రోజు. ఈ నేపథ్యంలో గ్రామీణం నుంచి పట్టణం వరకూ, కోస్తా నుంచి రాయలసీమ దాకా ప్రతి మూలలో ఈరోజు ప్రత్యేకతను ప్రతిబింబించేలా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది.
ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, కేవలం సభలు, ప్రసంగాలతో పరిమితం కాకుండా… అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి పెద్ద పండుగలా మలచాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ శాఖల కింద రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్క గ్రామం లేదా నియోజకవర్గం పరంగా కాకుండా, మొత్తం రాష్ట్రానికే అభివృద్ధి సంకేతాలు అందేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే సీఎం కార్యాలయం సంబంధిత అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చింది.
ఇతర పండుగలకంటే ఇది భిన్నమైనదిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సంక్రాంతి, దసరా, ఉగాది లాంటి పండుగలు ప్రాంతాల వారీగా వైవిధ్యాన్ని కలిగి ఉన్నా, ఈరోజు మాత్రం ఏపీలో ప్రతీ మూలకు అభివృద్ధి రేఖలు గీయనున్న రోజు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల దాకా ఈ వేడుకలు ఒకే సమయంలో జరిగేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడం అభినందనీయం. ప్రజల చైతన్యం, పాలకుల ప్రతిబద్ధత, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం ఈ రోజును ప్రత్యేకతను కలిగించనున్నాయి.
ఇంతకంటే ముఖ్యంగా, ఏడాది పాలనలోనే రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆహ్వానించి, దాదాపు 8.5 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించిన కూటమి ప్రభుత్వం.. ఈ రోజు ద్వారా తన సామర్థ్యాన్ని ప్రదర్శించనుంది. పాలన అంటే అభివృద్ధి అని ప్రజలకు మరోసారి గుర్తు చేసే ప్రయత్నంగా ఈ సంబరాలు ఉండనున్నాయి.