టిడిపి ఎంఎల్ఏపై కేసు

తెలుగుదేశంపార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఎంఎల్ఏ కురుగొండ్ల రామకృష్ణపై కేసు నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ వివాదంలో తనను నోటికొచ్చినట్లు తిట్టటమే కాకుండా బెదిరించారంటూ జిల్లాలోని రాపూరు మండలంలో పనిచేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణను ఎంఎల్ఏ నోటికొచ్చినట్లు తిడుతూ బెదిరించిన ఆడియో టేపు సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.

పోలింగ్ కు ముందు తర్వాత కూడా ప్రభుత్వ సిబ్బందిపైనే కాకుండా మామూలు జనాలపైన కూడా పోస్టల్ బ్యాలెట్ విషయంలోనే  కాకుండా ఇతరత్రా అంశాలపైన కూడా దాడులు చేస్తున్నారు. తమకు ఓట్లేయలేదన్న కారణంగా పలుచోట్ల ఆడవాళ్ళని కూడా చూడకుండా టిడిపి నేతలు దాడులు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

ఉభయగోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల టిడిపి దాడులు జరుగుతున్నాయి. టిడిపి నేతలు చేస్తున్న దాడుల కారణంగానే ఓడిపోతున్నారన్న ఉక్రోషంతోనే దాడులు చేస్తున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. వెంకటగిరి ఎంల్ఏ రామకృష్ణపై పోలీసులు నమోదు చేసిన కేసు కూడా ఇటువంటి కోవలోకే వస్తుంది.

ప్రభుత్వ యంత్రాంగం మీద, శాఖల సమీక్షల విషయంలో ఎన్నికల సంఘంతోను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంతో వివాదాలు పెట్టుకునే బదులు పార్టీలో ఎవరేమి చేస్తున్నారో కూడా చంద్రబాబునాయుడు దృష్టి పెడితే బాగుంటుంది.