ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఇంతకన్నా, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించిందనడానికి నిదర్శనం ఇంకేం కావాలి.? అప్పటికీ, ఇప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో ఏమైనా మార్పు వచ్చిందా.? అంటే, లేదాయె.! అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏపీ బీజేపీ గట్టిగా నినదిస్తోంది. దానర్థం, బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అదే మాట మీద వున్నట్టు కదా.? బీజేపీ జాతీయ నాయకత్వానిది ఓ మాట.. బీజేపీ రాష్ట్ర నాయకత్వానిది ఇంకో మాట వుండదు.
వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ‘అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు’ అంటున్నారు. ‘కానీ, విభజన చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై కమిటీ ఏర్పడింది.. ఆ కమిటీ సిఫార్సులకనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది, దాన్ని కేంద్రానికి పంపింది, కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా గుర్తించింది..’ అని స్వయానా కేంద్రమే చెప్పిందాయె.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తెచ్చినట్టే తెచ్చి, వెనక్కి తీసుకుందనీ.. ఈ క్రమంలో తమను సంప్రదించలేదని కూడా కేంద్రం పేర్కొంది. విషయం ఇంత స్పష్టంగా వుంటే, సజ్జల ఇంకా మూడు రాజధానులనడమేంటో.. ఏకైక రాజధాని అమరావతి అని కేంద్రం చెప్పలేదనడమేంటో.! విజ్ఞత కలిగిన నేత.. అని వైసీపీలో గుర్తింపు వున్న సజ్జల కూడా వైసీపీని డ్యామేజ్ చేసే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు.?